నాందేడ్‌లో తెరాస పోటీ

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 09:20 AM

ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తెరాస పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోను ఇప్పుడు పోటీ చేయబోతోంది. నిజామాబాద్‌కు సరిహద్దు జిల్లాగా ఉన్న నాందేడ్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని తెరాస భావిస్తోంది. ఆ జిల్లాలో తెలుగువారు అధికంగా ఉండటంతో అక్కడ తెరాస ప్రభావం బాగానే ఉంది. పైగా నిజామాబాద్‌-నాందేడ్‌ జిల్లాల మద్య ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కనుక నిజామాబాద్‌లో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల నాందేడ్ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తమ నియోజకవర్గాలలో కూడా అటువంటి కార్యక్రమాలు అమలుచేయాలని అందుకోసం అవసరమైతే తమ నియోజకవర్గాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతూ కొంతకాలం క్రితం నాందేడ్‌లోని ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కనుక నాందేడ్‌లో తెరాస పోటీ చేస్తే తప్పకుండా అన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని, నాందేడ్‌లో తెరాస ఏర్పాటుకు తమను అనుమతించాలని కోరుతూ స్థానిక నేతలు కొందరు సిఎం కేసీఆర్‌ను కలిసి అభ్యర్ధించారు. అక్కడి రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించిన తరువాత సిఎం కేసీఆర్‌ నాందేడ్‌లో తెరాస ఏర్పాటుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. కనుక త్వరలోనే నాందేడ్‌కు తెరాస విస్తరించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.





Untitled Document
Advertisements