హ్యూందాయ్‌ కార్లలో కొత్తరకం ఎయిర్‌బ్యాగ్‌..!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 01:51 PM

హ్యూందాయ్‌ కార్లలో కొత్తరకం ఎయిర్‌బ్యాగ్‌..!

వినియోగదారులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ భద్రతా ప్రమాణాలు ఉన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వాహన తయారీదారులు సైతం అదనపు భద్రతా ప్రమాణాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఎయిర్‌బ్యాగ్‌ వ్యవస్థ. వాహనాలు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల రక్షణ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ వ్యవస్థ పూర్తిగా ప్రమాదాలను నివారించలేకపోతోంది. కొన్ని సమయాల్లో డ్రైవర్‌, ఆ పక్క సీట్లో కూర్చొన్న ప్రయాణికుడు బలంగా ఢీకొనడంతో కూడా తీవ్ర గాయాలపాలవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూందాయ్‌ దీన్ని అరికట్టడానికి సరికొత్త ఎయిర్‌బ్యాగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది. సెంటర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌ పేరుతో డ్రైవర్‌, పక్క సీట్లో ఉన్న ప్యాసెంజర్‌కి మధ్య మరో ఎయిర్‌బ్యాగ్‌ని అమర్చబోతోంది. దీని ద్వారా ప్రయాణికుడు, డ్రైవర్ ఢీకొని తలభాగం గాయపడే అవకాశాలు 80శాతం మేరకు తగ్గుతాయని సంస్థ తెలిపింది. దీన్ని డ్రైవర్‌ సీట్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. వచ్చే సంవత్సరం రాబోతున్న కొత్త మోడళ్లలో వీటిని అమర్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.తాజాగా అభివృద్ధి చేసిన సెంటర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు సాధారణ వాటితో పోలిస్తే 50శాతం తేలికైనవని సంస్థ వివరించింది. పరిమాణంలోనూ చాలా చిన్నవని తెలిపింది. దీనిలో టెదర్‌ సాంకేతికతని ఉపయోగించినట్లు, దీని ద్వారా భారీ బరువుని సైతం ఎయిర్‌బ్యాగ్ సులభంగా అడ్డుకోగలదన్నారు.





Untitled Document
Advertisements