హై.... లక్ష్మి దొరికేసింది కదా!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:52 PM

హై.... లక్ష్మి దొరికేసింది కదా!!

గడ్డివాములో సూది వెదకమన్న చందంగా ఓ ఏనుగు జాడ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులకు ఎట్టకేలకు ఊరట లభించింది. రెండు నెలల తర్వాత పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆ ఏనుగును పట్టుకున్నారు. లక్ష్మి అనే ఏనుగును దాని మావటి నుంచి విడిపించి అడవుల్లోకి వదిలేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏనుగును స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై మావటి కుటుంబం దాడి చేసి, ఏనుగును తీసుకుని పారిపోయారు. దీంతో అటవీశాఖ అధికారులపై దాడి చేసిన నిందితులపై కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్టు డీసీపీ జస్మీత్ సింగ్ వెల్లడించారు.

దాదాపు రెండు నెలల పాటు తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని అడవుల్లో గాలించిన పోలీసులకు ఇటీవల ఏనుగు కాలిగుర్తులు, పేడ కనిపించాయి. ఇప్పటికే ఢిల్లీలోని అన్ని ఏనుగులను సంరక్షణా కేంద్రానికి తరలించినందున ఈ గుర్తులు లక్ష్మివేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చివరికి యమునా ఖాదర్ ప్రాంతంలోని ప్రముఖ అక్షరథాబ్ ఆలయం వద్ద ఏనుగును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మావటిని అరెస్టు చేశారు. దట్టమైన చెట్లు, పొదల మధ్య ఏనుగును బంధించి దాని ఆనవాళ్లు కనిపించకుండా మావటి జాగ్రత్తలు తీసుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు.

Untitled Document
Advertisements