షావోమి స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌... దేశం లో అతి పెద్ద టీవీ!!!!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 05:14 PM

షావోమి స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌... దేశం లో అతి పెద్ద టీవీ!!!!!

షావోమి మంగళవారం బెంగళూరులో స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. వీటిలో 65 అంగుళాల ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్‌ 4, మొదటిసారిగా లాంచ్‌ చేస్తున్న వాటర్‌ ప్యూరిఫయర్‌ ఉన్నాయి.ఈ షావోమి స్మార్టర్‌ లివింగ్‌ 2020 కార్యక్రమం కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షప్రసారమైంది. అలాగే సంస్థకు చెందిన అధికారిక సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారవమైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. అయితే ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయి, అమ్మకాలు జరుగుతున్న ఉత్పత్తులే నేడు భారతదేశానికి వస్తున్నాయని టెక్‌ నిపుణులు అంటున్నారు.

లాంచ్ ఈవెంట్లో విడుదల చేసిన ఉత్పత్తులలో 65 అంగుళాల ఎంఐ టీవీ ఇప్పటిదాకా షావోమి ఇండియా లో విడుదల చేసిన టీవీలన్నింటి కంటే అతి పెద్దది. ఇది కూడా 4k ఎల్‌ఈడీ ప్యానెల్‌తోనే మార్కెట్లోకి రానుంది. ఈ సంవత్సరంలో షావోమి ఇప్పటికే 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4k ప్రోను విడుదల చేసింది. తాజాగా విడుదలైన టీవీ నెట్‌ ఫ్లిక్స్‌ సపోర్ట్‌తో ఉందని షావోమి తెలిపింది. అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మిగతా టీవీలకు కూడా నెట్‌ఫ్లిక్స్‌ సపోర్ట్‌ అందిస్తామని ప్రకటించింది. అయితే ఏయే టీవీలకు నెట్‌ ఫ్లిక్స్‌ అందుబాటులోకి రానుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఎంఐ బ్యాండ్‌ 3కి సక్సెసర్ వెర్షన్‌గా ఎంఐ బ్యాండ్‌ 4ను షావోమి మార్కెట్లోకి తీసుకురానుంది. చైనాలో అందుబాటులో ఉన్న ఎంఐ బ్యాండే భారతదేశానికి వచ్చిందని టెక్‌ నిపుణుల అభిప్రాయం. ఈ బ్యాండ్‌ కలర్డ్‌ అమోలెడ్‌ (AMOLED) డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది.దీని తెర పరిమాణం 0.95 అంగుళాలుగా ఉండనుంది. 2.5 గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో, 120×240 పిక్సెల్‌ ఫీచర్లు కూడా ఈ బ్యాండ్‌లో ఉన్నాయి. మీ ఫోన్‌కు వచ్చే టెక్స్ట్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ను మీరు మీ బ్యాండ్‌లోనే చూసుకోవచ్చు. మ్యూజిక్‌ ప్లే చేసుకోవడం, స్టాక్‌, వాతావరణ అప్‌ డేట్లు తెలుసుకోవడం వంటివి ఒక్క క్లిక్‌తో చేయవచ్చు. ఎంఐ బ్యాండ్‌ కలర్డ్‌ డిస్‌ప్లేతో భారత మార్కెట్లోకి రావడం ఇదే ప్రథమం. అయితే ఇప్పటికే ఎంఐ బ్యాండ్‌4 ధర మార్కెట్లోకి లీకైంది. రూ.2,499 గా దీని ధర ఉండనుందని సమాచారం.

షియోమి ఈ కార్యక్రమంలో లాంచ్ చేసిన వాటిలో Mi మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 కూడా ఉంది. దీని యొక్క ధర 500రూపాయలు. ఇది షియోమి యొక్క క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లభిస్తుంది. ఒక వ్యక్తి గదిలో ఉంటేనే దాన్ని ఆన్ చేయడానికి వీలుఅవుతుంది. ఇందులో పరారుణ-సహాయ మోషన్ సెన్సార్‌ను ఉపయోగించి తయారుచేసారు.

భారతదేశంలో తమ సంస్థ నుంచి తొలి వాటర్‌ ప్యూరిఫయర్‌ని లాంచ్‌ చేశామని షావోమి వెల్లడించింది.ఇందులో నీళ్లు మూడు మార్గాల ద్వారా ప్రవహించి శుద్ధిచేయబడతాయి. అవి వరుసగా పిపిసి (పాలీప్రొఫైలిన్ కాటన్), యాక్టివేట్ కార్బన్, ఆర్‌ఓ ద్వారా శుద్దిచేయబడి చివరకు యాక్టివేట్ చేసిన కార్బన్ - యువి లైటింగ్ ద్వారా ప్రకాశించే ట్యాంక్‌లోకి వచ్చి చేరుతాయి.Mi వాటర్ ప్యూరిఫైయర్‌ను Mi హోమ్ యాప్ కి అనుసంధానించవచ్చు.





Untitled Document
Advertisements