రామాయణంలో శ్రీ రాముడు కూడా అదే చేశాడు : అమిత్ షా

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 05:23 PM

రామాయణంలో శ్రీ రాముడు కూడా అదే చేశాడు : అమిత్ షా

ఢిల్లీ : కశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.... సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఓ వైపు పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంటే, ఆ దేశ పాలకులు రెచ్చగొట్టేలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. రెండు రోజుల కిందట పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌తో సంప్రదాయ యుద్ధంలో ఓడిపోవచ్చు కానీ, అణు యుద్ధాన్ని మాత్రం కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.డ్జిల్లీలో మంగళవారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన ఐదో అంతర్జాతీయ రామాయణ ఉత్సవాలకు హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.... యుద్ధం వస్తే ఎంత భయానకంగా ఉంటుందో రామాయణంలో ఓ సన్నివేశాన్ని ఒక సూచనగా తీసుకోవాలని పాక్ ప్రధానికి చురకలంటించారు. ‘వాల్మీకి రాసిన రామాయణంలో రాముడు, సముద్రుడికి మధ్య జరిగిన సంభాషణ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేస్తుంది.. ఇది ఒక మహిళ గౌరవం కోసం జరిగిన యుద్ధం కాబట్టి స్త్రీ గౌరవం ఎంత పవిత్రమైందో కూడా చెబుతుంది’అని షా వ్యాఖ్యానించారు.‘లంకను దాటేందుకు మార్గం చూపమని సముద్ర దేవుడు వరుణుడిని శ్రీరాముడు మూడు రోజుల పాటు ఉపవాసం ఉండి, ధ్యానం చేసి ప్రార్థించాడు.. వరుణుడు కరుణించకపోవడంతో శ్రీరాముడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాణాలను సముద్రుడిపై ప్రయోగించడంతో అనేక జీవరాశులు మరణించాయి. ఈ చర్యకు భయపడిన వరుణుడు తన తప్పును మన్నించమని, మార్గాన్ని చూపించాడు’అని అమిత్ షా పేర్కొన్నారు. తాము కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని పాక్‌కు పరోక్షంగా హెచ్చరికలు పంపారు.అంతకు ముందు ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 46 వ జాతీయ సదస్సుకు హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. జాతీయ భద్రత కోసం ప్రధాని తీసుకున్న సర్జికల్, ఎయిర్ స్ట్రెయిక్స్‌ లాంటి నిర్ణయాలను ప్రజలు సమర్ధిస్తున్నారని, తమ ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళ్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించి చిన్న అంశంలోనూ రాజీపడబోమని, ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేశామని అన్నారు. భారత్‌కు ప్రత్యేకంగా జాతీయ భద్రతా విధానమంటూ లేదని, మాటలకే పరిమితమని, తన ప్రజల భద్రతకు చర్యలు తీసుకోదని మాట్లాడే ప్రపంచ దేశాలకు సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా సమాధానం ఇచ్చామని అన్నారు. సరిహద్దులతోపాటు దేశానికి చిన్న కీడుతలపెట్టినా సహించేది లేదని బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా తెలియజెప్పామని షా వ్యాఖ్యానించారు. ఈ దాడులతో భారత్‌కు అంతర్జాతీయంగా మరింత గౌరవం పెరిగిందని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements