మోదీ పాకిస్థాన్ మీదుగా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి: భారత్

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 06:03 PM

మోదీ పాకిస్థాన్ మీదుగా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి: భారత్

త్వరలో భారత ప్రధాన మంత్రి మోదీ న్యూయార్క్‌ పర్యటనకు వెళ్లనున్న దృష్ట్యా పాకిస్థాన్‌ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతించాలని భారత్‌ ఆ దేశాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై పాకిస్తాన్ నుండి సమాధానం రావాల్సి ఉందని అధికారవర్గాలు వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాశాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ తమ గగనతలంలోకి భారత విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ గత వారం ఈ విషయాన్ని పాకిస్థాన్‌ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, పాకిస్థాన్‌ తమ సమాధానాన్ని సెప్టెంబరు 20లోపు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.ఒకవేళ ప్రధాని విమానాన్ని పాకిస్థాన్‌ తమ గగన తలంలోకి అనుమతించపోతే, అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐనీఏఓ) నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటానని గతంలో పాక్‌ అగ్రీమెంట్ పై సంతకం కూడా చేసింది. ఈ నిబంధనల ప్రకారం..యుద్ధం లేదా ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల్లో మాత్రమే గగన తలంలోకి విమానాన్ని అనుమతించడం పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ఉల్లంఘనను భారత్‌ ఐసీఏఓకు కనుక ఫిర్యాదు చేస్తే పాకిస్థాన్ భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.నెల రోజుల క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు దేశాల పర్యటన సందర్భంగా కూడా పాక్‌ అనుమతి ఇవ్వలేదు. భారత రాష్ట్రపతి తమ గగన తలం గుండా వెళ్లేందుకు అనుమతించకూడదన్న నిర్ణయాన్ని స్వయంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆమోదించారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్యను భారత్‌ ప్రయోజనం లేని ఏకపక్ష నిర్ణయంగా అభివర్షించింది.

Untitled Document
Advertisements