మోదీ తో సమావేశం సంతోషకరంగా జరిగింది

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 06:23 PM

మోదీ తో సమావేశం సంతోషకరంగా జరిగింది

న్యూ ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛీఫ్ మమతాబెనర్జీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో బుధవారం ఇరువురు సమావేశమయ్యారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మమత మాట్లాడుతూ.. తమ మధ్య సమావేశం సంతోషకరంగా జరిగిందన్నారు. బెంగాల్‌ రాష్ట్ర పేరు మార్పులో ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. అలాగే వీరిద్దరి భేటీ సందర్భంగా పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు సమస్యలు, ఎన్‌ఆర్‌సీ గురించి మమత ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. కాగా ప్రధానిగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వీరిద్దరి మధ్య భేటీ జరగడం​ ఇదే తొలిసారి కావడంతో, వారి భేటీపై ఆసక్తి నెలకొంది. బీజేపీని అన్ని విషయాల్లో విమర్శించే మమత ఒక్కసారిగా మోదీతో భేటీ అవడంతోటి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి అలాగే జూన్‌లో జరిగిన నీతిఅయోగ్‌ సమావేశానికి కూడా మమత గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements