రూ.2 వేల నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేత!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 05:19 AM

రూ.2 వేల నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేత!

ఆర్‌బిఐ రెండు వేల రూపాయల నోట్లు ముద్రణను పూర్తిగా నిలిపి వేసింది. అందుకే నగదు విత్‌డ్రా చేసేందుకు మీరు ఎటిఎంకు వెళ్లినప్పుడు ఇదివరకటిలా రెండు వేల రూపాయల నోట్లు రావడం లేదు. భారత రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండు వేల రూపాయల నోట్లను ఒక్కటి కూడా ముద్రించ లేదని ఆర్‌బిఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్తా ప్రచురణ సంస్థ అడిగిన ప్రశ్నకు సమాచార హక్కు చట్టం కింద ఆర్‌బిఐ ఈ వివరాలు తెలియజేసింది. దేశంలో నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడమే ప్రధాన లక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నవంబర్‌లో పాత 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్‌బిఐ కొత్తగా రూ.2 వేల నోటును, ఆ తర్వాత రూ.500 నోటును తీసుకు వచ్చింది. కాగా 201617 ఆర్థిక సంవత్సరంలో 3,542,991 మిలియన్ల రెండువేల రూపాయల నోట్లను ముద్రించినట్లు ఆర్‌బిఐ ఆ సమాధానంలో తెలియజేసింది. అయితే ఆ తర్వాత 201718 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను మాత్రమే ముద్రించింది.201819 సంవత్సరానికి వచ్చే సరికల్లా నోట్ల ముద్రణ కేవలం 46.690 మిలియన్ల నోట్లకు పడిపోయింది. అధిక విలువ కలిగిన నోట్ల చెలామణిని తగ్గించడం వల్ల నల్లధనాన్ని అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మరో వైపు రూ.2 వేల నోట్ల అధిక చెలామణి వల్ల అవినీతి కార్యకలాపాలు నియంత్రించాలనే ప్రభుత్వ లక్షానికి కూడా గండి పడుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో లెక్కట్లో చూపని ఆరు కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు అత్యధునాతన నాణ్యత కలిగిన నకిలీ 2 వేల రూపాయల నోట్లను పాక్ కేంద్రంగా ముద్రిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. గత మూడేళ్లలో రూ.50 కోట్లకు పైగా విలువ కలిగిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాల దృష్టా రూ.2 వేల నోట్లను క్రమేణా చెలామణినుంచి ఉపసంహరించుకోవాలని ఆర్‌బిఐ భావిస్తోంది.





Untitled Document
Advertisements