ఏపీకి 69. 34, టీఎస్ కు 79 టిఎంసిలు నీరు విడుదల!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 05:49 AM

ఏపీకి 69. 34, టీఎస్ కు 79 టిఎంసిలు నీరు విడుదల!

తెలంగాణకు 79 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 69. 34 టిఎంసిల నీరు విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటికి తోడు అదనంగా కేటాయింపులు జరపగా, నవంబరు నెలాఖరు వరకు పొదుపుగా వాడుకోవాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ వాటర్ ఇయర్ ప్రారంభం నుంచి గణించి, ఆంధ్రప్రదేశ్‌కు మొత్తంగా 302 టిఎంసిలు, తెలంగాణకు 127.436 టిఎంసిలు కేటాయించారు. ఇందులో ఎపి పరిధిలో 232.65 టిఎంసిల నీటినిఇదివరకే వినియోగించగా, మిగిలిన 69.34 టిఎంసిల నీటిని నవంబరు నెలాఖరు వరకు వినియోగించాలని బోర్డు సూచించింది. ఇదేవిధంగా తెలంగాణ పరిధిలో 48.43 టిఎంసిలను మాత్ర మే వినియోగించారు. ఎపిలో 232 టిఎంసిలు వినియోగిస్తే, తెలంగాణలో కేవలం 48.4 టిఎంసిలు వినియోగించారు. గత ఆగస్టు 30వ తేదీన కృష్ణా బోర్డు కేటాయింపులతో కలిపి, తాజా ఉత్తర్వుల్లో లెక్కలు సరిచేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో మొత్తంగా 232.6 టిఎంసిలను వినియోగించగా, కేవలం పోతిరెడ్డిపాడు నుంచే 113 టిఎంసిల నీటిని వినియోగించడం గమనార్హం.నీటి వినియోగానికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు పథకానికి తాజాగా 15 టిఎంసిల నీటిని కేటాయించారు. మొత్తంగా 27.7 టిఎంసిలు కేటాయించగా, ఇప్పటి వరకు 12.7 టిఎంసిలు వినియోగించారు. ఇదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగర్ ఎడమ కాలువ 45 టిఎంసిలు, ఎఎంఆర్ ప్రాజెక్టుకు 17 టిఎంసిలు, మిషన్ భగీరథకు 2 టిఎంసిల వినియోగానికి అనుమతి లభించింది. ఎడమ కాలువలో 63.22 టిఎంసిల వినియోగానికి అనుమతి ఉండగా, ఇప్పటికే 18.2 టిఎంసిలు వినియోగించారు. ఎఎంఆర్‌పి, హైదరాబాద్ తాగునీటికి 33.14 టిఎంసిలకు అనుమతించగా, ఇప్పటికే 16.1 టిఎంసిలు వాడుకున్నాము. మిషన్ భగీరథకు 3.35 టిఎంసిలకు అనుమతి ఉండగా, ఇప్పటి వరకు 1.35 టిఎంసిలు వినియోగించారు. ఆగస్టు 30న కృష్ణా బోర్డు అనుమతించిన నీటిలో ఇంకా 10 టిఎంసిల నీటిని తెలంగాణ వినియోగించలేదు. దీంతో ఆ నీటితో కలిపి తాజా నీటి విడుదల ఉత్తర్వుల్లో లెక్కలు సర్ధుబాటు చేశారు.శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 3.03 టిఎంసిల నీటిని తీసుకోవాలని బోర్డు అనుమతించింది. ఇప్పటి వరకు మొత్తం గా 116 టిఎంసిలను పోతిరెడ్డిపాడు నుంచి మొత్తంగా అనుమతిస్తే ఇప్పటి వర కు 112.9 టిఎంసిలను వినియోగించారు. ఇంక మిగిలిన 3.03 టిఎంసిలను నవంబరు నెలాఖరు వరకు పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించింది. ఇందులోనే మద్రాసుకు సరఫరా చేసే నీరు కూడా కలిసివుంది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల కోసం 20 టిఎంసిలు మొత్తంగా కేటాయించగా, ఇప్పటి వరకు 10.25 టిఎంసిలు వినియోగించారు. మిగిలింది 9.7 టిఎంసిలు.





Untitled Document
Advertisements