పత్రికా విలేకరి హత్యపై పవన్ స్పందన...మనం ఏపీలోనే ఉన్నామా?

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 05:53 AM

పత్రికా విలేకరి హత్యపై పవన్ స్పందన...మనం ఏపీలోనే ఉన్నామా?

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి(కాతా సత్యనారాయణను) దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ హత్య దారుణమైన, క్రూరమైన సంఘటన అని అన్నారు. ఈ ఘటనను ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని పేర్కొన్నారు. సంఘటన జరిగిన తీరు చూస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని అనిపించకమానదని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉందన్నారు. భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సత్యనారాయణ ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు తెగించారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని అనుమానించక తప్పదని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణపై నెల కిందటే ఒకసారి హత్యాయత్నం జరిగిందని.. అది పోలీసుల వరకు వెళ్లినప్పటికీ ఆయనకు రక్షణ కల్పించకపోవడం దారుణమని పవన్ అన్నారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 15) రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం పక్షపాతం చూపకుండా విలేకరి హత్య వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని అందించాలని కోరారు. విలేకరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (45)ను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు.విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు.





Untitled Document
Advertisements