మరో 500 విక్రయకేంద్రాలు!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 05:58 AM

మరో 500 విక్రయకేంద్రాలు!

పాల ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టిందని పశుసంవర్ధక, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ పరిధిలో నూతనంగా 500 ఔట్‌లెట్‌లను (విక్రయకేంద్రాలు) ప్రారంభించనున్నట్లు బేగంపేటలోని హరితప్లాజాలో మంగళవారం విజయ డెయిరీ బోర్డు సమావేశంలో తలసాని ప్రకటించారు. కాగా ఈ సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి శ్రీసందీప్ కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైవే రహదారుల వెంట విజయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, విజయ ఉత్పత్తులు తెలిపేలా హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో విజయ డెయిరీ ఉత్పత్తులను వినియోగించేలా ఆదేశాలు ఇచ్చేందుకు త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలవనున్నట్లు పేర్కొన్నారు.ప్రైవేటు డెయిరీల ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా విజయ డెయిరీ ఉత్పత్తుల ధరలపై నిర్ణయం తీసుకునే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. అన్ని దేవాలయాలలో విజయ నెయ్యి మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న సమ్మక్క సారక్క జాతరలో సుమారు 150 మొబైల్ ఔట్లెట్ల ద్వారా విజయ ఉత్పత్తులను విక్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విజయ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాసయాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు . సినిమా థియేటర్లు, సోషల్ మీడియా, టివిలలో విజయ ఉత్పత్తులపై ప్రచారం చేయాలని సూచించారు . అంతే కాకుండా వాల్ పెయిటింగ్స్, పర్యాటక ప్రాంతాలు, హైవేలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో కూడా ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయ ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న దేవాదాయ, హైవే, రైల్వే, హెచ్‌ఎండిఎ తదితర శాఖల అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements