సమ్మె ముగించండి

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:35 AM

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం మంగళవారం కాస్త తీవ్రంగానే స్పందించింది. పండుగ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం సరికాదంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ సమ్మె చేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని పిటిషనర్‌ను నిలదీసింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇకనైనా సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది.

ఆర్టీసీ సమ్మె పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సమ్మె జరుగుతున్నప్పటికీ 75 శాతం బస్సులు తిరుగుతున్నాయనే ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు తప్పు పట్టింది. అన్ని బస్సులు తిరుగుతుంటే పాఠశాలలకు దసరా శలవులు ఎందుకు పొడిగించారని నిలదీసింది. అయినా అంతమంది డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కడున్నారని ప్రశ్నించింది. అసలు ఆర్టీసీకి ఇంతకాలం మేనేజింగ్ డైరెక్టరును ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. తక్షణమే ఆర్టీసీకి ఎండీని నియమించాలని ఆదేశించింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని, ఒకవేళ అలా చేస్తే మిగిలిన కార్పొరేషన్లు కూడా అదే డిమాండుతో ఉద్యామిస్తాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సమ్మె చేస్తే తప్ప ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని, అనివార్య పరిస్థితులలో సమ్మె చేస్తున్నామని, కనుక ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చితే సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల బాధ్యత కనుక తక్షణమే చర్చలు ప్రారంభించి శుక్రవారంలోగా సమ్మె ముగించేందుకు గట్టిగా ప్రయత్నించాలని ఇరువర్గాలకు హైకోర్టు సూచించింది. సమ్మె విరమింపజేయడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో శుక్రవారం జరిగే తదుపరి విచారణలో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనుక తప్పనిసరిగా రేపటి నుంచి మళ్ళీ చర్చలు ప్రారంభించకతప్పదు. ముందే చర్చలు కొనసాగించి ఉండి ఉంటే నేడు కోర్టు చేత ఈవిధంగా అక్షింతలు వేయించుకొనే దుస్థితి ఎదురయ్యేది కాదు కదా!





Untitled Document
Advertisements