జి 7 సదస్సు: తీవ్ర విమర్శలు వస్తున్నా ట్రంప్ లెక్కచేయడం లేదట

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 04:46 PM

వాషింగ్టన్ : జి7 దేశాల అంతర్జాతీయ సదస్సు 2020 జూన్ 10 నుంచి 12 వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత గోల్ఫ్ రిసార్టులో నిర్వహించడానికి నిర్ణయమైంది. మరెక్కడైనా ఈ సదస్సును ఏర్పాటు చేస్తే విపరీతమైన ఖర్చు పెట్టవలసివస్తుందని ఈ రిసార్డులో అయితే సగానికి సగం ఖర్చు తగ్గుతుందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా ట్రంప్ లెక్కచేయడం లేదు. ట్రంప్ స్వంత వాణిజ్య ప్రయోజనాల కోసమే ఈ రిసార్టును ఎంపిక చేసినట్టు వస్తున్న విమర్శలను ఆయా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. తాత్కాలిక వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ ముల్వనే గురువారం ఈ వివరాలను పాత్రికేయులకు తెలియచేశారు.

ఫ్లోరిడా మియామీ లోని ట్రంప్ నేషనల్ డోరల్ ఫెసిలిటీ వేదికపై జరగనున్న ఈ 46 వ జి7 సదస్సులో ప్రపంచం లోని పెద్ద వర్ధమాన దేశాలైన ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. కాలిఫోర్నియా, కొలొరాడో, ఫ్లోరిడా, హవాయి, మిచిగన్, ఉత్తర అమెరికా, టెన్నెస్సే, యుటా తదితర 12 ప్రాంతాల జాబితా నుంచి ఈ వేదిక స్థలం ఎంపిక అయినట్టు చెప్పారు. దూరం, దగ్గర ప్రాంతాలన్నిటికీ ఈ ప్రాంతం అందుబాటులో ఉంటుందని, లాభాపేక్ష దృష్టితోనే ఈ వేదిక ట్రంప్ స్వంత రిసార్టులో ఏర్పాటు చేస్తున్నట్టు వచ్చిన తీవ్ర విమర్శలకు ముల్వనే సమాధానం ఇస్తూ ఇందులో ట్రంప్‌కు వచ్చే లాభం అంటూ ఏదీ లేదని అన్నారు. ట్రంప్ బ్రాండ్‌కు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటే అది గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

ఈ సదస్సు వల్ల ప్రపంచ ఆర్థిక ప్రగతికి ఎదురవుతున్న సవాళ్లను, అభివృద్ధికి అవసరమైన రాయితీల పునరుద్దరణ, ప్రగతి నిరోధానికి దారితీసే నిబంధనల ఉపసంహరణ, వాణిజ్య దళారీతనం నివారించడం, శక్తివంతమైన ఆర్థిక మార్కెట్లను తిరిగి ప్రారంభించడం తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు వస్తాయని వివరించారు. అయితే వాషింగ్టన్ పోస్టు ఈ ఏర్పాట్లపై తీవ్రంగా విమర్శించింది.

ఆధునిక అమెరికా చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదివరకు ఎన్నడూ తీసుకోలేదని, డొరాల్ రిసార్టు ఇటీవల కాలంలో నష్టాలతో నడుస్తోందని, ఆపరేటింగ్ ఆదాయం 2015 నుంచి 2017 నాటికి 69 శాతం తగ్గిపోయిందని ట్రంప్ ఆర్గనైజేషన్ స్వంత రికార్డులే వెల్లడిస్తున్నాయని వాషింగ్టన్ పోస్టు విమర్శించింది. మియామీ ప్రదేశం చాలా వేడిగా ఉంటుందని, హోటల్ కూడా 40 శాతం తక్కువగానే అతిధులతో ఉంటుందని విమర్శలు రావడం జర్నలిస్టులు, దౌత్యవేత్తలు, భద్రతా అధికారుల దృష్టికి వచ్చి చర్చనీయాంశం అవుతోంది.





Untitled Document
Advertisements