PKL 2019 విజేత....బెంగాల్ వారియర్స్

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 11:04 PM

PKL 2019 విజేత....బెంగాల్ వారియర్స్

ప్రొ కబడ్డీ లీగ్‌ 7లో ఛాంపియన్‌గా బెంగాల్ వారియర్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 39-34 తేడాతో గెలిచిన బెంగాల్ టీమ్.. తొలిసారి టైటిల్‌ని ముద్దాడింది. ఈ ఫైనల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ముగియగా.. దబాంగ్ ఢిల్లీ కూడా ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి.ఫైనల్‌ మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి గురైన బెంగాల్ వారియర్స్ పాయింట్ల ఖాతా తెరిచేలోపే దబాంగ్ ఢిల్లీ 6-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ.. ఈ దశలో కెప్టెన్ మహ్మద్ వరుస రైడ్ పాయింట్లతో బెంగాల్ వారియర్స్‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. మ్యాచ్‌లో 13 సార్లు రైడ్‌కి వెళ్లిన మహ్మద్ 9 పాయింట్లతో ఆకట్టుకోగా.. డిఫెన్స్‌లో జీవా 4 పాయింట్లతో సత్తాచాటాడు. దీంతో.. హాఫ్ టైమ్‌ ముగిసే సమయానికి మ్యాచ్ 17-17తో సమమైంది.సెకండాఫ్‌‌లో తొలి ఐదు నిమిషాలు బెంగాల్ వారియర్స్‌కి దబాంగ్ ఢిల్లీ గట్టి పోటీనిచ్చింది. దీంతో.. స్కోరు 18-18... 20-20తో సమమవుతూ రావడంతో రెండు జట్లు కొంచెం రక్షణాత్మకంగా ఆడినట్లు కనిపించాయి. కానీ.. మహ్మద్ వరుసగా సూపర్ రైడ్‌లతో దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేయడంతో.. ఒక్కసారి బెంగాల్ వారియర్స్ 30-24తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశ నుంచి ఢిల్లీ పుంజుకునేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. ఢిల్లీ టీమ్‌లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ 24 సార్లు రైడ్‌కి వెళ్లి 18 పాయింట్లు సాధించాడు. కానీ.. అతనికి డిఫెన్స్ నుంచి ఆశించినంత సహకారం లభించలేదు.జులై 20న ప్రారంభమైన ఈ కబడ్డీ ఏడో సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడగా.. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ దశ మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించగా.. ఎలిమినేటర్స్, సెమీ ఫైనల్స్ తర్వాత.. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్‌కి చేరాయి. లీగ్ దశలోనే తెలుగు టైటాన్స్ ఇంటిబాట పట్టింది.





Untitled Document
Advertisements