'మా' వివాదంపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 07:16 PM

'మా' వివాదంపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(మా)లో మరో వివాదం మొదలయింది. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తగాదాలు జరిగాయో.. మళ్లీ ఇప్పుడు వీకే నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పాత పరిస్థితులే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్యానెల్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఆదివారం జరిగిన జనరల్ మీటింగ్ సాక్షిగా ఈ వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి.ఆదివారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నామని తప్పకుండా ఈసీ సభ్యులంతా హాజరుకావాలని జీవితా రాజశేఖర్ మెసేజ్‌లు పంపారు. అయితే, అధ్యక్షుడు నరేష్ లేకుండా జనరల్ బాడీ మీటింగ్ ఏమిటని ఆయన తరఫున లాయర్ జీవితా రాజశేఖర్‌కు నోటీసు పంపారు. దీంతో ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని.. సభ్యులంతా సరదాగా ఏర్పాటుచేసుకున్న జనరల్ మీటింగ్ అని వివరణ ఇచ్చారు. అయితే, ఇది సరదాగా ఏర్పాటుచేసుకున్న మీటింగ్ అయినప్పటికీ చాలా వాడీవేడీగా జరిగింది.ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టు ఈసీ సభ్యుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ వెల్లడించారు. మీటింగ్ నుంచి బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యులపై నిప్పులు చెరిగారు. ‘‘నేను గెలిచినందుకు ఆనందపడాలో అనవసరంగా వచ్చానని బాధపడాలో అర్థం కావడంలేదు. 26 మందిలో శివాజీరాజా ప్యానెల్ మీద గెలిచినవారు 18 మంది. అంటే అత్యధిక మెజారిటీ. ఇంత మంది ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. పాతవి అన్నీ బయటికి తీసి గొడవ చేస్తున్నారు’’ అని పృథ్వీ చెప్పారు.ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచిందని, సభ్యులంతా కష్టపడి పనిచేయాలని పృథ్వీ అన్నారు. ‘‘ఈ పదవులను ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారు. ఇలాంటి వాళ్లు అసెంబ్లీ వస్తే అంతే.. సెక్రటేరియట్ బయటి నుంచి కూడా కదలరు. అసోసియేషన్ బాగోగులు గురించి చూడాలి కానీ.. ఇవేం గొడవలు. మీటింగ్ అంటే హడావుడిగా తిరుపతి నుంచి వచ్చాను. కానీ, లోపల అంతా గొడవ’’ అని పృథ్వీ వెల్లడించారు. సీనియర్ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణను కూడా మాట్లాడనివ్వలేదని చెప్పారు.‘‘400 సినిమాలకు పనిచేసిన మా గురువు గారు పరుచూరి గోపాలకృష్ణగారిని కూడా మాట్లాడనివ్వలేదు. దౌర్భాగ్యం ఇది. ఆయన కన్నీరు పెట్టుకుని బయటికి వెళ్లిపోయారు. ఆయన్ని అలా చూడటం తొలిసారి నాకు. నిజంగా ఇది చాలా బాధాకరం’’ అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements