మీరు చెప్పేది ఏదీ వాళ్ల బుర్రల్లోకి ఎక్కదు...మోడీకి పూరి సలహా

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 08:59 PM

మీరు చెప్పేది ఏదీ వాళ్ల బుర్రల్లోకి ఎక్కదు...మోడీకి పూరి సలహా

ప్లాస్టిక్ వాడకం.. దాని రీసైక్లింగ్ గురించి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీకి సలహా ఇచ్చారు. ఆ సలహా కూడా తనదైన శైలిలో ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల నిజంగా సమస్య ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం పూరి సోషల్ మీడియా ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు.‘‘వాతావరణ మార్పు అనేది నేడు ప్రపంచ అతిపెద్ద సమస్య. వాతావరణ మార్పునకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ప్లాస్టిక్ ఒకటి. కానీ అదే ప్రధాన కారణం కాదు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం వల్ల వాతావరణ మార్పును అడ్డుకోలేం.1960ల్లో ప్లాస్టిక్ కనిపెట్టి, ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇది మనిషి అద్భుత సృష్టి అని ప్రజలు భావించారు. ఎందుకంటే అప్పటి వరకు పేపర్ బ్యాగులను ఎక్కువగా వాడేవారు. ప్లాస్టిక్ బ్యాగులను చాలా సులభంగా తయారుచేయడమే కాదు.. అవి ఎక్కువకాలం మన్నుతాయి, దృఢంగా ఉంటాయి. ప్లాస్టిక్‌ను వాడటం మొదలుపెట్టడం వల్ల నిజానికి మనం చాలా చెట్లను, అడవిని కాపాడాం. దాని వల్ల పర్యావరణాన్ని కాపాడటంతో పాటు జీవావరణాన్ని బ్యాలన్స్ చేయగలిగాం.
*వాతావరణ మార్పునకు కారణాలు:
ప్లాస్టిక్ తనంతట తాను మనకు సమస్య కాలేదు. ప్రజలే ప్లాస్టిక్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యంతో, క్రమశిక్షణ లేకుండా బద్ధకం, అశ్రద్ధతో ప్లాస్టిక్‌ను సమస్యగా మారుస్తున్నారు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం గతంలో వాడిన పేపర్, కాటన్ బ్యాగ్సేనని మనం భావిస్తే.. మళ్లీ మనం చెట్లను నరకాల్సి వస్తుంది. సారవంతమైన భూముల్ని పత్తి పంటకోసం వాడాల్సి వస్తుంది. ఈ రెండూ పర్యావరణం, జీవావరణ వ్యవస్థకు నష్టం చేస్తాయి.కొన్ని లక్షల వాహనాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి ప్రమాదకర వాయువులు, లక్షలాదిగా వెలిసిన పరిశ్రమలు, ఫ్యాక్టరీల కారణంగా పర్యావరణం కలుషితమవుతోంది. రెండు శతాబ్దాల క్రితం మన జనాభా ఒక బిలియన్. కానీ, ఇప్పుడు అది 8 బిలియన్లు అయ్యింది. వాళ్లంతా వాతావరణంలోకి ఎంత మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తున్నారో ఊహించండి. మనం, ఈ మనుషులం, భూ మండలానికి పట్టిన వైరస్. మీరు నమ్ముతారో లేదో కానీ, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా వాతావరణ మార్పునకు కారణమవుతున్నాయి.
*పరిష్కారం:
మనం ఔచిత్యంతో వాడుకోవడానికి, మళ్లీ తిరిగివాడుకోవడానికి సరిపడా ప్లాస్టిక్ ఈ ప్రపంచంలో ఉంది. ప్లాస్టిక్‌ను ద్వేషించడం, నిషేధించడం మానేద్దాం. కానీ, ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ను బయట పారేయకుండా దాన్ని రీసైకిల్ చేయడం, తిరిగి వాడటం గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్, రీయూసింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి మనకు నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలి.మొదట మనం చేయాల్సిన ముఖ్యమైన పని, వీలైనన్ని ఎక్కువ మొక్కలను నాటడం.. అడవుల పెంపకాన్ని ప్రభుత్వ పాలసీ చేయడం. మన జనాభాను నియంత్రించాలి. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనార్థాల గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి.మనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలి. దీని వల్ల పెట్రోలు, డీజిల్ వాహనాల నుంచి వెలువడే విషవాయులను క్రమేపీ తగ్గించొచ్చు. మాంసం ఉత్పత్తిని మనం తగ్గించగలిగితే పశువుల పెంపకం కూడా క్రమేపీ తగ్గుతుంది. దీని వల్ల పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను మనం తగ్గించొచ్చు. కూరగాయలు, పండ్లనే మనం ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నా.. మనం పర్యావరణాన్ని కాపాడినట్టే.
*ప్రోత్సాహకాలు:
ఇవన్నీ పక్కన బెడితే, జనాలు మన లెక్చర్లు వినరు. వాతావరణ మార్పును వాళ్లు లెక్కచేయరు. ఏదీ వాళ్ల బుర్రల్లోకి ఎక్కదు. కానీ, ప్లాస్టిక్‌ను సేకరించడానికి, దాన్ని రీసైక్లింగ్ యూనిట్లకు తరలించడానికి ప్రజలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే కనుక ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్వచ్ఛ భారత్ చేస్తారు. ప్లాస్టిక్‌కు ప్రభుత్వం ఒక ధరను అందజేస్తే గనుక, ప్రజలు ప్లాస్టిక్‌ను డబ్బులా చూస్తారు. ప్లాస్టిక్‌ను పర్యావరణంలో పారేయకుండా ఇళ్లలోనే దాచిపెట్టుకుంటారు’’ అని తన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. చూద్దాం దీనికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తారో లేదో..!





Untitled Document
Advertisements