ముస్లింలకు మద్దతుగా తీర్పు వెలువడినా తొందరపడబోము!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 09:40 PM

ముస్లింలకు మద్దతుగా తీర్పు వెలువడినా తొందరపడబోము!

అయోధ్య కేసులో తీర్పు తమవైపు ఉంటే పట్టువిడుపులు ప్రదర్శిస్తామని, మసీదు నిర్మాణంలో జాప్యం చేస్తామని ఈ కేసులో ముస్లిం కక్షిదార్లు కొందరు తెలిపారు. ఆవేశాలు రగలకుండా ఉండేందుకు అన్ని విధాలుగా యత్నిస్తామని వెల్లడించారు. సామరస్య పరిరక్షణే తమ ప్రధాన ఆలోచన అని లిటిగెంట్‌లలో ఒకరైన హాజీ మెహబూబ్ శనివారం తెలిపారు. వివాదాస్పద స్థలం ముస్లిం పక్షానిదే అని తీర్పు వెలువడినా తాము తొందరపడబోమని, ముందుగా ఈ స్థలం చుట్టూ ప్రహారీగోడ కట్టి వదిలిపెడుతామని, మసీదు నిర్మాణం అత్యవసరంగా చేపట్టబోమని స్పష్టం చేశారు. అయితే ఇదితన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామజన్మభూమి వ్యాజ్యంలో విచారణల ప్రక్రియ పూర్తయింది.తొందరలోనే దీనిపై తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ముస్లిం లిటిగెంట్ తమ వైఖరిని తెలిపారు. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితిని బేరీజు వేసుకుని తాను తన వైఖరిని వెల్లడించినట్లు, దీనిపై ఇతర కక్షిదార్లతో కూడా మాట్లాడనున్నట్లు చెప్పారు. అయోధ్యకు చెందిన మరో లిటిగెంట్, జమాయిత్ ఉలేమా హిందూ అధ్యక్షులు ముఫ్తీ హస్బుల్లా బాద్‌షా ఖాన్ కూడా హాజీ అభిప్రాయంతో ఏకీభవించారు. మత సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది చాలా సబబైన విషయం అని, పరిస్థితి గురించి తాము సీనియర్ ముస్లిం మతపెద్దలతో మాట్లాడుతామని చెప్పారు. తీర్పు అనుకూలిస్తే మసీదు నిర్మాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిదని అన్నారు. మసీదు నిర్మాణం జాప్యం చేయడాన్ని తాను కూడా సమర్థిస్తున్నట్లు మరో కక్షిదారు మెహమ్మద్ ఉమర్ కూడా తెలిపారు.మసీదు నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేయడం ద్వారా సామరస్యం శాంతి కాపాడినట్లు అవుతుందని అన్నారు. అయితే ముస్లింల తరఫు వ్యాజ్యాలలో కీలకమైన వ్యక్తి ఇక్బాల్ అన్సారీ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ముందు తీర్పు రానివ్వండి …తరువాత చూద్దాం. అయిఏ దేశ లౌకిక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లరాదని, సామరస్యం కీలకమని చెప్పారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల ఏకబిగి విచారణ ప్రక్రియను ముగించింది. అయోధ్య వివాదాస్పద స్థలం రాముడిదా? బాబ్రీమసీదుదా? అనేది వచ్చే నెలలో సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడికానుంది. తీర్పు పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





Untitled Document
Advertisements