వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్ట్ నిలిపివేత!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 11:45 PM

వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్ట్ నిలిపివేత!

నెంబర్ ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మార్చుకునే పోర్టబులిటీని నిలిపివేస్తున్నట్లు టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకటించింది. నవంబర్ 4 నుంచి నవంబర్ 10 వరకు వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీని నిలిపివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ఆ తర్వాత నవంబర్ 11 నుంచి కొత్త విధానంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ ప్రారంభం కానుంది. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ట్రాయ్ వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. మొబైల్ నంబర్ పోర్టబులిటీ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మొబైల్ నంబర్ పోర్టబులిటీకి దాదాపు వారం రోజుల వరకు సమయం పడుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. కేవలం రెండు రోజుల్లోనే మీరు ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మారిపోవచ్చు. ఈ విషయాన్ని ట్రాయ్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం పోర్ట్ పెడితే నెట్ వర్క్ మారడానికి దాదాపు వారం రోజుల వరకు పడుతుంది. నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పదో తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు మొబైల్ నంబర్ పోర్టబులిటీ పని చేయదని ట్రాయ్ ఒక ప్రకటన ద్వారా వివరించింది. అప్పట్నుంచీ మొబైల్ నంబర్ పోర్టబులిటీకి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో వినియోగదారులు యూపీసీని జనరేట్ చేసి నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు అందిస్తే వారి అభ్యర్థనను ఆమోదిస్తామని కూడా ట్రాయ్ తెలిపింది. అయితే ఆ లోపు కోడ్ ను జనరేట్ చేయలేకపోతే.. నవంబర్ 11 వరకు వేచి ఉండాల్సిందేనని పేర్కొంది. నవంబర్ నాలుగో తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో పోర్ట్ పెట్టడానికి ప్రయత్నించే వారికి తమ తరఫు నుంచి ఎటువంటి స్పందన రాదని ట్రాయ్ చెప్పింది. జియో నెట్ వర్క్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఈ మొబైల్ నంబర్ పోర్టబులిటీకి డిమాండ్ చాలా ఎక్కువైంది. అప్పటిదాకా డేటా, కాల్ చార్జీలకు రెండిటికీ విడివిడిగా చార్జీలు చెల్లించిన వినియోగదారులు డేటాకి, కాల్స్ కు కలిపి ఒకే మొత్తం, అది కూడా అత్యంత తక్కువ మొత్తం చార్జ్ చేయడంతో జియో వైపు చూడటం మొదలు పెట్టారు. దీంతో వినియోగదారులను కోల్పోకుండా ఉండటం కోసం మిగతా నెట్ వర్క్ లు కూడా కాల్ చార్జీలు, డేటా ప్యాక్ ల విషయంలో దిగిరాక తప్పలేదు. అయినప్పటికీ మిగతా నెట్ వర్క్ ల నుంచి జియోకి వలసలు ఆగలేదు. దీంతో జియో సేవలు ప్రారంభమైన మూడు సంవత్సరాల్లోనే భారతదేశంలో నంబర్ వన్ టెలికాం సంస్థగా నిలిచింది. రెండో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉండగా, మూడో స్థానంలో ఎయిర్ టెల్ ఉన్నాయి. జియో ప్రభంజనాన్ని తట్టుకోవడం కోసం వొడాఫోన్, ఐడియాలు ఒక్కటైన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements