సోషల్ మీడియాలపై కొత్త రూల్స్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 06:10 AM

సోషల్ మీడియాలపై కొత్త రూల్స్!

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని పెంచే, అపఖ్యాతి పాలు చేసే, జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టే అభిప్రాయాల, సందేశాల వ్యాప్తి అమితంగా జరుగుతున్నదని వాటిని అరికట్టడానికి, క్రమబద్ధం చేయడానికి తగిన నిబంధనలను రూపొందించడానికి మూడు మాసాల వ్యవధి కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు సుప్రీంకోర్టును కోరింది. సామాజిక మాధ్యమాల్లో ఈ రకమైన ప్రచారం పెరిగిపోతున్నదని, ఇంటర్‌నెట్ ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థకు ముప్పుగా పరిణమించిందని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం అభిప్రాయపడినట్టు సమాచారం. సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయించాలంటూ మద్రాసు, ముంబై, మధ్యప్రదేశ్ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను రప్పించుకొని విచారణ చేపట్టాలంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వేసిన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం కోరిన మీదట కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి గత నెలలో సుప్రీంకోర్టు మూడు వారాల వ్యవధిని ఇచ్చింది.ఈ కేసుల విషయంలో తీసుకునే నిర్ణయాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి గనుక వాటి విచారణను సుప్రీంకోర్టు చేపట్టడం అవసరమని సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. మూక దాడులకు, హత్యలకు దారితీస్తున్న తప్పుడు వార్తలను, సందేశాలను పంపిస్తున్న అసలు వ్యక్తులెవరో తెలుసుకోవలసి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నది. తమ ఖాతాదార్ల ఆధార్ కార్డులను అందుబాటులో ఉంచడానికి సోషల్ మీడియా వేదికలు నిరాకరిస్తున్నాయి. తమ వినియోగదారుల పరస్పర సందేశాలకు, అభిప్రాయ వ్యక్తీకరణకు వేదికగా ఉపయోగ పడుతున్నందుకు గర్విస్తున్నానని వాటిని పెడుతున్న వ్యక్తులెవరో తెలుసుకోడం, బయటపెట్టడం చేయబోనని వాట్సాప్ గతంలో స్పష్టం చేసి ఉన్నది. ఇందుకు దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది కూడా. జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో టెర్రరిస్టుల మధ్య పరస్పర సందేశాలకు సోషల్ మీడియా ఉపయోగపడుతున్నదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.అయితే సోషల్ మీడియాను అదుపు చేయడానికి ఉద్దేశించే నిబంధనలు దానిని నిజంగా దుర్వినియోగపరుస్తున్నవారిని నిరోధించడం వరకు మాత్రమే పరిమితమైతే మంచిదే. కాని ప్రజాస్వామిక భావ ప్రకటన స్వేచ్ఛను సైతం అవి హరిస్తే అది భారతీయ సమాజానికి, దాని ప్రగతిశీల వికాసానికి అత్యంత ప్రమాదకరం అవుతాయి. మంచిని చెడును ఒకే గాటన కట్టి బాదడం అనేది ఎంత మాత్రం హర్షించదగినది కాదు. దుష్టాంగాన్ని నరకడానికి ప్రాణం తీయడానికి గల తేడాను గమనించి వ్యవహరించాలి. ప్రభుత్వాలు మీడియాపై విరుచుకుపడినప్పుడల్లా జాతి శ్రేయస్సు కోసమే ఆ పని చేస్తున్నామని చెబుతాయి. వాస్తవంలో అది జాతి అభివృద్ధిని, అభ్యుదయాన్ని బలి తీసుకుంటుంది. ఎమర్జెన్సీ వంటి ఘట్టాల్లో జరిగింది ఇదే. అందుచేత సోషల్ మీడియా రెక్కలు కట్టివేయాలనే పాలకుల ఉబలాటాన్ని బేషరతుగా సమర్థించలేము.ఆర్టికల్ 370ని రద్దు చేసిన చర్యపై నోరు విప్పబోమంటూ హామీ పత్రాల మీద సంతకాలు చేస్తేనే విడుదల చేస్తామని జమ్ము కశ్మీర్‌లో అరెస్టు చేసిన వేలాది మందికి అక్కడి ప్రభుత్వం షరతు విధించిందన్న వార్త గమనించదగినది. తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదకర వ్యక్తుల విడుదల సందర్భంలోనే నేర శికా్ష్మస్మృతిలోని 107వ నిబంధన కింద ఈ హామీని లిఖితపూర్వకంగా తీసుకుంటారు. దీనిని జమ్ము కశ్మీర్‌లో నిర్బంధంలోని రాజకీయ విమర్శకులకు వర్తింప చేయడం ఒక రకంగా ప్రజాస్వామిక మౌలిక స్వేచ్ఛ అయిన భావ ప్రకటన స్వాతంత్య్రానికి గొడ్డలి పెట్టువంటిదే అవుతుంది. ప్రధాన స్రవంతి సమాచార మాధ్యమాలు అయిన పత్రికలు, టెలివిజన్ చానళ్లలో సర్వస్వతంత్రమైన అభిప్రాయాల వ్యక్తీకరణకు దారులు దాదాపు మూసుకుపోతున్న నేపథ్యంలో ప్రజాస్వామికమైన భావజాలాన్ని విరుద్ధ అభిప్రాయాలను నిర్భయంగా వ్యాపింపజేయడానికి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు గొప్ప వేదికలుగా అందివచ్చాయి.ఆ మేరకు ఇంటర్‌నెట్ విశ్వసమాజానికి చెప్పనలవికాని మేలు చేస్తున్నది.





Untitled Document
Advertisements