క్లీన్‌స్వీప్ కు మరో రెండు వికెట్లు!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:08 AM

క్లీన్‌స్వీప్ కు మరో రెండు వికెట్లు!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసేందుకు కోహ్లీ సేన రెండు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే సిరీస్‌లో 20 ఆధిక్యంలో ఉన్న భారత్ వైట్‌వాష్‌కు చేరువైంది. రాంచీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికాకు ఇన్నింగ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే కీలక వికెట్లు చేజారడంతో దక్షిణాఫ్రికాకు మరోసారి ఘోర పరాజయం తప్పక పోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సఫారీ జట్టు మరో 203 పరుగులు చేయాలి. దాంతో మంగళవారం నాలుగో రోజు భారత్ విజయం లాంఛనమేనని చెప్పాలి. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన పర్యాటక జట్టుకు మరోసారి కష్టాలు తప్పలేదు. ఈసారి కూడా భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో సఫారీల ఇన్నింగ్స్‌ను శాసించారు. షమి, ఉమేశ్‌లు అసాధారణంగా రాణిస్తూ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.





Untitled Document
Advertisements