చిదంబరానికి బెయిల్ మంజూరు!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:56 AM

చిదంబరానికి బెయిల్ మంజూరు!

మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి సుప్రీ కోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సెప్టెంబర్5 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో లక్ష రూపాయల పూచికత్తు మీద ఆయనకు బెయిల్ దొరికింది. కానీ ఈ సీనియర్ కాంగ్రెస్ నేత అక్టోబర్ 24 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోనే ఉండనున్నారు. ఢిల్లీలోని తిహార్ జైల్లో నెల రోజులకుపైగా ఉన్న చిదంబరాన్ని గత వారం ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం చిదంబరాన్ని రిమాండ్‌కు తరలించనున్నారు. ఈడీ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న చిదంబరానికి ఇంటి నుంచి ఆహారం తెప్పించడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయిలెట్, కళ్లద్దాలు, మందులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఏసీ సౌకర్యం కల్పించాలని చిదంబరం చేసుకున్న వినతి పట్ల ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోజుకు అరగంట చొప్పున కుటుంబ సభ్యులు, బంధువులను కలిసే అవకాశం ఆయనకు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.





Untitled Document
Advertisements