బాంగ్లాతో సిరీస్...24న భారత్ జట్టు ఎంపిక

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:37 PM

బాంగ్లాతో సిరీస్...24న భారత్ జట్టు ఎంపిక

టీంఇండియా నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడబోతోంది. తొలుత ఢిల్లీ, రాజ్‌కోట్, నాగ్‌పూర్ వేదికగా మూడు టీ20ల్లో తలపడే భారత్.. ఆ తర్వాత ఇండోర్, కోల్‌కతా వేదికగా రెండు టెస్టుల్లో బాంగ్లాను ఢీకొట్టనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. టీ20 సిరీస్‌లో తలపడే జట్టుని ప్రకటించేసింది. భారత సెలక్టర్లు కూడా ఈనెల 24న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జట్టుని ఎంపిక చేసేందుకు షెడ్యూల్‌ని రూపొందించారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించిన సెలక్టర్లు.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకి టీ20 పగ్గాలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచ‌కప్ జరగనున్న నేపథ్యంలో యువ క్రికెటర్లకీ జట్టులో అవకాశాలివ్వడం ద్వారా వారిని పరీక్షించాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికే ఈ టీ20 సిరీస్‌‌‌ సెలక్షన్‌కి తాను అందుబాటులో ఉండనని ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో విఫలమైన శిఖర్ ధావన్, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించిన రిషబ్ పంత్‌ ఎంపికపై సందిగ్ధత నెలకొంది. వారికి సెలక్టర్లు మరో అవకాశమిస్తారా..? లేక వేరొకరిని ఎంపిక చేస్తారా..? అనేది తేలనుంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ.. భారత్ జట్టు ప్రకటనకి ముందు సెలక్టర్లతో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.





Untitled Document
Advertisements