తప్పు ఒప్పుకున్న రోహిత్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:44 PM

తప్పు ఒప్పుకున్న రోహిత్!

సఫారీలతో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ మళ్ళీ తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాపై సిరీస్‌లోని మూడు టెస్టుల్లో ఒక డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు బాదేశాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన ఈ ఓపెనర్ ఏకంగా 529 పరుగులు చేయడం ద్వారా టాప్ స్కోరర్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’ని అందుకున్నాడు. అంతేకాకుండా.. సిరీస్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాది ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. రాంచీలో డబుల్ సెంచరీ నమోదు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రోహిత్‌నే వరించింది. ఈరోజు రాంచీ టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్‌కి థ్యాంక్స్. మ్యాచ్‌లో కొత్త బంతి ఎప్పటికీ ప్రమాదమే. కానీ.. ఒక ఓపెనర్‌గా ఆ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 2013లో తొలిసారి వన్డేల్లో నేను ఓపెనర్‌గా ఆడినప్పుడు.. క్రమశిక్షణతో ఆ కొత్త బంతిని ఎదుర్కొనేవాడ్ని. దక్షిణాఫ్రికాతో తాజా టెస్టు సిరీస్‌లోనే అదే తరహాలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించా. కొత్త బంతి కొంచెం పాతబడే వరకూ టెస్టుల్లో క్రమశిక్షణతో ఆడాలనే విషయం నాకు అర్థమైంది. టీమ్‌లో నీకు చోటు దక్కలేదంటే దాని అర్థం నువ్వు తప్పిదాలు చేసినట్లు’ అని పరోక్షంగా వెస్టిండీస్ టూర్‌లో తనకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై రోహిత్ శర్మ అంగీకరించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మకి తుది జట్టులో చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో ఆడించాడు. దీంతో.. రిజర్వ్ బెంచ్‌కి పరిమితమైన రోహిత్ శర్మని చూసి తనకి బాధేసిందని టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా ఆ సిరీస్ సమయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టుల్లో అప్పటి వరకూ మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. టీ20, వన్డే తరహా షాట్ సెలక్షన్‌తో పేలవంగా వికెట్ చేజార్చుకుంటూ వచ్చాడు. దీంతో.. టెస్టుల్లో నిలకడలేని బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికాతో సిరీస్ ముందు వరకూ రోహిత్ శర్మ‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ చూసేది. కానీ.. ఒక్క సిరీస్‌తో అతను గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిపోయాడు. ఇకపై అలాంటి తప్పిదాలు చేయకుండా క్రమశిక్షణతో టెస్టుల్లో ఆడతానని చెప్పుకొచ్చిన రోహిత్.. క్రీజులో కుదురుకున్న తర్వాత మాత్రం టీమ్‌కి మెరుగైన స్కోరు కోసం గేర్ మార్చతానని స్పష్టం చేశాడు.





Untitled Document
Advertisements