అంబులెన్స్ ఆలస్యం వల్ల నిండు గర్భినిగా ఉన్న సినీ నటి మృతి!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:08 PM

అంబులెన్స్ ఆలస్యం వల్ల నిండు గర్భినిగా ఉన్న సినీ నటి మృతి!

అంబులెన్స్‌ సమయానికి రాకపోవడం వల్ల నిండు గర్భినిగా ఉన్న సినీ నటి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. హింగోలి జిల్లాకు చెందిన పూజ జుంజర్ అనే మరాఠీ నటికి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కొద్ది నిమిషాలకే మృతి చెందింది. ఈ క్రమంలో పూజకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు ఇక్కడి వైద్యులు. ఆ ఆస్పత్రి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడంతో జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కాగా, అంబులెన్స్ సరైన సమయంలో వచ్చివుంటే పూజ ప్రాణాలు దక్కేవని ఆమె కుటుంబసభ్యులు వాపోయారు. ఆదివారం ఉదయం 2గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజ పలు మరాఠీ సినిమాల్లో నటించారు. గర్భవతి కావడంతో సినిమాలకు కొంత విరామం ప్రకటించి తన సొంత గ్రామానికి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఇలాంటి ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.





Untitled Document
Advertisements