నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ టాప్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:47 AM

నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ టాప్

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య రోజురోజుకి దారుణంగా పెరిగిపోతోంది. దేశవ్యాప్తం నేర ఘటనలు పదిశాతం వరకూ ఉత్తరప్రదేశ్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. దీంతో నేరాల జాబితాలో ఈ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2017 సంవత్సరానికి సమర్పించిన తాజా గణాంకాలలో వెల్లడైంది. బిజెపి నేత యోగి ఆదిత్యానాథ్ సిఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మూడు లక్షలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ విధంగా నేరచరిత్రలో మొదటి స్థానం దక్కించుకున్న యుపి తరువాతి స్థానంలో మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీలు నిలిచాయి. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం మీద ఈ ఏడాదిలో 30,62,579 కేసులు నమోదయ్యాయి. 2016 రికార్డులలో ఈ కేసుల సంఖ్య 29,75,711. అంతకు ముందటి ఏడాది 2015లో ఈ సంఖ్య 29,49,400. ఈ విధంగా రెండేళ్ల జాప్యం తరువాత వెలువరించిన గణాంకాల జాబితాతో కేసుల సంఖ్యలో ఎదుగుదల కన్పించింది. అత్యధిక జనాభా ఉన్న యుపిలో 2017 రికార్డు మేరకు పదిశాతం అంటే 3,10,004 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది కూడా నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఏ ఏటికాఏడు నేరాల సంఖ్య ఇనుమడిస్తోంది. 2016లో నమోదయిన కేసుల సంఖ్య 2,82,171. అంతకు ముందటి ఏడాది వీటి సంఖ్య 2,41,920. ఇక ముంబై వంటి మహానగరం ఆయువుపట్టుగా ఉన్న మహారాష్ట్రలో నేరాల సంఖ్య మొత్తం నేరాల సంఖ్యతో పోలిస్తే 9.4 శాతంగా నిలిచింది.2017లో ఇక్కడ నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 2,88,879. 2016లో ఈ సంఖ్య 2,61,714. అంతకు ముందటి ఏడాది ఈ సంఖ్య 2,75,414. ఇక మధ్యప్రదేశ్ మొత్తం క్రైంరేటులో 8.8 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. 2017లో ఇక్కడ నమోదయిన కేసుల సంఖ్య 2,69,512. అంతకు ముందటి ఏడాది 2016లో ఈ సంఖ్య 2,68,614. అంతకు ముందటి ఏడాది ఈ సంఖ్య 2,64,418. యుపి, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో పౌరమిత్ర సేవల ఆన్‌లైన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని మేరకు పౌరులు వాహనాల చోరీ, ఇతరత్రా దొంగతనాల గురించి ఫిర్యాదు చేసుకునేందుకు వీలేర్పడిందని ఎన్‌సిఆర్‌బి తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఈ రాష్ట్రాల్లోనే పలు రకాల నేరాలు జరుగుతూ ఉన్నందున మిగిలిన రాష్ట్రాలలో ఇటువంటి ఆన్‌లైన్ ఫిర్యాదు సౌకర్యం కల్పించలేదని వెల్లడించారు.ఈ రాష్ట్రాలలో నేరాల రికార్డు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక స్థాయిలో ఉంటోందని వెల్లడించారు. నేరాల జాబితాలో బీహార్ ఆరో స్థానంలో నిలిచింది. అక్కడ ఇప్పటి రికార్డుల ప్రకారం 2017లో నమోదైన కేసుల సంఖ్య 1,80,573 వరకూ ఉంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఈ నేరాల రికార్డుల బ్యూరో పనిచేస్తోంది. ఐపిసి పరిధిలోకి వచ్చే నేరాల గణాంకాలను విశ్లేషించుకుని ప్రతి ఏటా నమోదవుతున్న క్రైమ్ రేటును రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వారిగా పొందుపర్చడం, ఏడాదికేడాది ఈ నేరాల సంఖ్యలతో కూడిన జాబితాను వెలువరించడం జరుగుతోంది.





Untitled Document
Advertisements