ప్రజల సొమ్ము కార్పొరేట్లకు ఇచ్చేందుకే బ్యాంకుల విలీనం!!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 06:01 AM

ప్రజల సొమ్ము కార్పొరేట్లకు ఇచ్చేందుకే బ్యాంకుల విలీనం!!

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేఖంగా మంగళవారం బంద్ నిర్వహించారు. బ్యాంకుల విలీనం పేరుతో ప్రజల సొమ్మును కార్పొరేట్ల్లకు ధారదత్తం చేయటానికే ఈ విలీనాల ప్రక్రియను కేంద్రం చేపట్టిందని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎపి, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యలు ఆరోపించాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, బ్యాంకుల నిర్వాహణ లాభంలో ఉన్నప్పటికీ మొండి బకాయిలకు కేటాయించడం కారణంగా నష్టాలను చవిచూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో కార్పొరేట్ల ఆస్తులు పెరిగి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు తగ్గే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు తెల్చిచెప్పారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో భాగంగా బ్యాంకుల విలీనాలు చేపట్టిందని విమర్శించారు. 10 బ్యాంకులు విలీనమై 4 బ్యాంకులుగా మారితే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం, విలీనాలతో బ్యాంకుల ప్రేవేటీకరణకు దారితీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు. బ్యాంకుల విలీనంతో ఉద్యోగులు తగ్గిపోవడంతో పాటు నిరుద్యోగ సమస్య పెరిగి పోతుందన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై ఉద్యోగుల సంఘాల సమ్మె ప్రభావం పాక్షికంగా కనిపించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రెండు ఉద్యోగ సంఘాలు మంగళవారం ఈ సమ్మె నిర్వహించారు. దీంతో కౌంటర్ వద్ద నగదు డిపాజిట్లు, విత్‌డ్రాతో పాటు చెక్‌ల క్లియరెన్స్ వంటి సేవలపై దేశవ్యాప్త సమ్మె ప్రభావం కనిపించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల బ్రాంచ్‌లలో అధికారులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఎఐబిఇఎ(ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్), బిఇఎఫ్‌ఐ(బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సమ్మె గురించి ఎస్‌బిఐతో సహా చాలా వరకు బ్యాంకులు ముందే హెచ్చరించాయి.





Untitled Document
Advertisements