యోగి పాలనపై అఖిలేశ్ విమర్శలు

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:15 AM

యోగి పాలనపై అఖిలేశ్ విమర్శలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రామరాజ్యం లేదని, రామరాజ్యం ఉందని అనడం దేవుడయిన రాముడిని మోసగించడమే అవుతుందని ఆయన మంగళవారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాక్షసుల రాజు అయిన రావణుని నుంచి పాఠాలు నేర్చుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆదర్శవంతమయిన 'రామరాజ్యం' దిశగా సాగుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో అన్నారు. 'వారు రాష్ట్రంలో రామరాజ్యం ఉందని అన్నారు. అది రాముడిని మోసగించడమే అవుతుంది. వారు రావణుని నుంచి నేర్చుకున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే వారు కలియుగ రావణునిలాగా పని చేస్తున్నారు' అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదిత్యనాథ్ అన్ని రంగాలలో విఫలమయ్యారని, రాష్ట్రంలో అభివృద్ధి వెనుకపట్టు పట్టిందని ఆయన విమర్శించారు. 'నేను ఆయన (ఆదిత్యనాథ్)ను యోగి అని పిలవలేను. ఎందుకంటే ఆయన ప్రవర్తన భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించనదానికి వ్యతిరేకంగా ఉంది' అని అఖిలేశ్ అన్నారు. ''యోగి' అనే పదం పెట్టుకున్నందుకు ఎక్కడైనా ఫిర్యాదు చేయడానికి సంస్థ ఉంటే, అందులో నేనే ముందు ఫిర్యాదు చేసి ఉండేవాడిని. ఆయన ప్రజలకు న్యాయం చేయలేదు' అని యాదవ్ పేర్కొన్నారు. ఝాన్సీకి చెందిన పుష్పేంద్ర యాదవ్‌ను నకిలీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ, 'ఈ పాలనలో ఎవరైనా హత్యకు గురికావొచ్చు. ఇక్కడ శాంతిభద్రతలు లేవు. పోలీసులు అమాయకులను చంపుతున్నారు. ప్రభుత్వం నేరస్థులను శిక్షించకుండా కాపాడుతోంది' అని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.





Untitled Document
Advertisements