కోహ్లీకి అన్ని విధాలా మద్దతు ఇస్తాం: దాదా

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:11 PM

కోహ్లీకి అన్ని విధాలా మద్దతు ఇస్తాం: దాదా

బీసీసీఐ నూతన అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈరోజు నియమితులయ్యారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా. బీసీసీఐ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండదు. బోర్డులో ఎటువంటి అవినీతి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అందరికీ బోర్డు ఒకేలా ఉంటుంది. నేను టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తరహాలోనే.. బీసీసీఐని కూడా ముందుకు నడిపిస్తా' అని గంగూలీ అన్నారు.'ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి విరాట్ కోహ్లీ. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అద్భుత విజయాలను సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లీ తాపత్రయం. అతడికి అన్ని విధాలా మద్దతు ఇస్తాం. కోహ్లీతో రేపు సమావేశమవుతా. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం' అని దాదా తెలిపారు.'కొత్తగా బాధ్యతలు చేపట్టినందున భారత జట్టు కెప్టెన్‌, కోచ్‌ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదు. కెప్టెన్‌, కోచ్‌, ఆటగాళ్ల ఎంపికంతా సెలెక్షన్‌ కమిటీ చేతుల్లోనే ఉంటుంది. టీమిండియా కెప్టెన్లంతా బీసీసీఐ అధ్యక్షులతో సఖ్యంగానే ఉన్నారు. మొదటగా దేశంలోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం' అని దాదా స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి దాదా టీమిండియా బ్లేజర్ వేసుకుని వచ్చారు.





Untitled Document
Advertisements