రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 06:56 AM

టిఆర్‌ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీచేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమన్వయ సమితి సభ్యుల నియామకాలు త్వరలో చేపట్టనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. జూన్‌లోగా గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వ య సమితిని ప్రభుత్వం బలోపేతం చేసి రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని నిర్ణయించారు.క్లస్టర్ల వారిగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న ట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయసమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సిఎం చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాలతో పంటల విస్తీర్ణం పెరగడం, దేశానికి ఆదర్శంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో రైతు సమన్వయ సమితికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గుత్తాసుఖేందర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్‌గా ఎంపిక కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షపదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ముఖ్యనాయకుడిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఇటీవల హుజూర్‌నగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌ఛార్జీగా బాధ్యతలు నిర్వహించి సైదిరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా నియమించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రైతు సమన్వయసమితి అధ్యక్షుడుగా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పల్లా ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పల్లాను అభినందించారు. రైతులకు అన్నివేళల అందుబాటులో ఉండాలని పల్లా రాజేశ్వర్ రెడ్డికి సిఎం కెసిఆర్ చెప్పారు. విద్యార్థి సంఘనాయకుడిగా ఎదిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి 2014లో టిఆర్‌ఎస్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీలో చేరిన అనంతరం 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆతర్వాత పట్టభద్రుల నియోజక వర్గం నుంచి 2015లో శాసన మండలికి పోటీచేసి విజయం సాధించారు. 2015లో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018 శాసన సభ ఎన్నికల్లో పాలేరు, మహబూబాబాద్ నియోజకవర్గాలు, ఖమ్మం ఎంపి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల సైదిరెడ్డిని భారిమెజారిటీతో గెలిపించుకోవడంలో పల్లా ఎంతో కృషి చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రాజేశ్వర్ రెడ్డిని ఈ పదవిలో నియమించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గల సైనికుడిగా పల్లాకు గుర్తింపు ఉందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.





Untitled Document
Advertisements