హైకోర్టులో రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అఫిడవిట్ దాఖలు

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 06:58 AM

ఆర్టీసీ సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టుకు శనివారం అఫిడవిట్ సమర్పించారు. కార్మికులు విధుల్లో చేరతామన్నా వారిని కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవడం కష్టమేనన్నారు. కోర్టు దృష్టికి రాని అంశాలను తెలియజేసేందుకే ప్రత్యేకంగా ఈ అఫిడవిట్ దాఖలు వేస్తున్నామన్నారు. సర్కార్‌ను టార్గెట్‌గా చేసి ఆర్టీసీని బెదిరించేందుకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి యూనియన్‌లుమంటరాజేస్తున్నాయని చెప్పారు. కొందరి వ్యవహారం వల్ల తాము తప్పు చేయకున్నా కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ దశలో ఆర్టీసీ సంస్థ, కార్మికుల సంక్షేమం దృష్ట్యా వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దశలో ఉద్యోగులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహనతో ఉండాలన్నారు. ఆర్టీసీ నష్టాలను పక్కనపెట్టి ప్రభుత్వం 44 శాతం వేతనాలను పెంచడంతోపాటు మధ్యంతర భృతి 16 శాతం ప్రకటించిందన్నారు. అయితే ఆమోదయోగ్యం కాని విలీనం డిమాండ్‌తో సమ్మెకు దిగారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 50 కార్పొరేషన్‌తు ఉండగా అవికూడా ఇవే డిమాండ్ చేస్తున్నాయన్నారు. పండగవేళల్లో లాభాలను ఆశించిన ఆర్టీసీ ఈ సమ్మెతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం విలీనం డిమాండ్‌ను పక్కన పెడుతున్నామని ప్రకటించడంలోనే వారి ప్రవర్తన ఏమిటో వెల్లడవుతోందంటూ భవిష్యత్తులో ఎపుడైనా ఇదే డిమాండ్‌తో అస్థిరపరిచేందుకు యత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావంతో పొదుపు సొమ్ము తరిగిపోవడంతోపాటు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నదన్నారు. అధిక సంఖ్యలో కార్మికులు నిరవధికంగా సమ్మెలో ఉంటే సమాజంపైన, ఆర్థిక వ్యవస్థపైన దీని ప్రభావం మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు. సమ్మె అన్నది కార్మికుల అమ్ములపొదిలో అస్త్రమని, అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని ఉపయోగించాలని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని స్పష్టం చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 22 ప్రకారం కార్మికులు సమ్మెలోకి దిగాలంటే ఆరు వారాలు లేదా 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని, ఒకవేళ చర్చలు జరుగుతుంటే అది పూర్తి అయ్యాక వారం తర్వాత సమ్మెకు వెళ్లాలని చెప్పారు. రవాణా విభాగం ఆరు నెలలపాటు ప్రజోపయోగ సర్వీసుల్లోకి వస్తుందని ఆగస్టు 26న జీవీ ఇచ్చామన్నారు. సెక్షన్ 22 ప్రకారం సమ్మె నోటీసులు ఇవ్వనందున సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని శర్మ వివరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొన్నవారిపై నెలపాటు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చునన్నారు. వీటిని పరిశీలించి త్వరగా తగిన ఉత్తర్వులివ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌ను కోరారు.





Untitled Document
Advertisements