రాష్ట్రాన్ని బీహార్‌గా మార్చేశాడు!

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 10:06 AM

రాష్ట్రాన్ని బీహార్‌గా మార్చేశాడు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దక్షిణాది బీహార్‌గా మార్చేశారని యనమల దుయ్యబట్టారు. ఆరునెలల్లో ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్‌ గడచిన ఆరునెలల్లో 12 రకాల దోపిడీలతో అవినీతి పాలనకు తెరతీశారని ఆయన ధ్వజమెత్తారు. సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములను తన అనుంగులకు చౌకగా కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు.ప్రభుత్వ భూములను అమ్మేసి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో నవరత్నాలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారని, వాటిని అమ్ముకోవడానికి సంక్షేమం ముసుగేయడం దేనికని ఆయన ప్రశ్నించారు. ఇలా చేయడం పేదలను వంచించడమేనని విమర్శించారు. అన్ని జిల్లాల్లో మైనింగ్ లీజులను మంత్రులు, తన బినామీలకే ఇస్తున్నారని, సున్నపురాయి, లేటరైట్‌, బాక్సైట్‌, గ్రానైట్‌ వంటి ఖనిజాలన్నీ దోచేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రస్తుతమున్న లీజుదారులను బెదిరిస్తున్నారని యనమల పేర్కొన్నారు.పన్నుల భారంతో పేద, మధ్యతరగతి ప్రజలు తల్లఢిల్లుతున్నారని, రివర్స్ టెండరింగ్ విధానమంటూ రాష్ట్రాభివృద్ధినే రివర్స్ చేశారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆరాచక రాజకీయాలకు మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యే నిదర్శనమని ధ్వజమెత్తారు. సాక్షియేతర మీడియాపై ఉక్కుపాదంమోపి, మీడియా నోరునొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని యనమల విమర్శలు గుప్పించారు.జగన్‌ పాలనపై ఎవ్వరికి నమ్మకం లేదని రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. కార్మికులకు పని లేకుండా చేసినందున రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, దీనికి ఇసుక కొరత కూడా తోడవ్వడంతో పోలవరం, అమరావతి, ఇరిగేషన్‌ లాంటి పనులు కూడా ఆగిపోయాయని యనమల మండిపడ్డారు.







Untitled Document
Advertisements