పేదరికంలో మనిషితనం ఎంత నలిగిపోతుందో ఈ కథ చెబుతుంది

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 06:42 PM

అర్ధరాత్రి గాలివానకు గంట ముందు లిఫ్ట్ ఎక్కబోతుంటే గోడపక్కన వాల్చిన పైపు మంచం మీద వాచ్మన్, అతని భార్యా పడుకొని కనిపించారు. ఎప్పుడూ తనొక్కడే పడుకొనేవాడు. నలుగురు పిల్లలకు తోడు అల్లుడు కూడా వచ్చాడేమో, ఆ సింగిల్ రూమ్ లో సర్దుకోలేక భార్య ఇలా బయటపడినట్టుంది. నేనింకా లిఫ్ట్ లో ఉండగానే ‘’ఒక రాత్రల్లా ఇడవకుండా ఒకే పక్క మీద నీతో పడుకోవాలని ఉందిరా?’’ అన్న అప్పాయమ్మ గుర్తుకొచ్చింది.

ఎంత గొప్ప కథలైనా ఎంతోకాలం గుర్తుండవు నాకు. ఏడాది తిరిగేసరికి పాత్రలన్నీ మాసిపోయి స్టోరీ లైనొక్కటే మిగులుతుంది. అటు తర్వాత అదీ మిగల్దు. అటువంటి నన్ను పాతికేళ్లుగా కాళీపట్నం రామారావు కథ ‘నోరూమ్’ వెంటాడుతోంది. వాచ్మన్ దేవుడు, దేవుడి భార్య అప్పాయమ్మ, కుర్రకుంక నూకరాజు ఎన్ని సందర్భాలలో ఎంతగా గుర్తొచ్చారో! యాభై ఏళ్ల క్రితం రాసిన కథ. అందులో కులముందీ వర్గముందీ సంఘర్షణుందీ నలిగిపోయిన మనుషులూ తీరని వాళ్ల కోరికలూ కలలూ…ఒక్క మాటలో దుఃఖాన్ని దట్టించిన విషాద కావ్యం ‘నోరూమ్’.

పేదరికంలో మనిషితనం ఎంత నలిగిపోతుందో ఈ కథ చెబుతుంది. కనీసం భార్యాభర్తలుగా బతకలేని బాధలు అందులోని పాత్రలు. పెళ్లయి ఇరవై ఏళ్లయినా కిక్కిరిసిన గుడిసెలో చాటుమాటుగా కానివ్వడమే కాపురం. ‘’చీకటి తెరలూ గోనె పరదాలూ తడికలూ మంచాల చాటున భయం భయంగా బితుకు బితుగ్గా ఎవరో చెయ్యరాని వారితో చెయ్యరాని పనిచేస్తున్నట్టు- అసహ్యాలు దిగమింగుకొని, చల్లారీ చల్లారని నరాల తీపులతో , కుట్టే నల్లుల్నీ ముసిరే దోమల్నీ, జుమ్ముమనే ఈగల్నీతోలుకుంటూ, పిల్లల రొచ్చుల్లో పెద్దల రోతల్లో, చుట్టూరా కంపులే ఇంపులుగా యింతకాలం జీవన వ్యాపారం సాగిస్తూ వచ్చారు వాళ్లు’’. మనసూ శరీరమూ ధ్వంసమై చావుకు దగ్గరైనప్పుడు ధైర్యంచేసి భర్తను ఒక కోరిక కోరింది అప్పాయమ్మ. ‘’ఒక రాత్రల్లా ఇడవకుండా ఒకే పక్క మీద...' తనతో కలసి పడుకోవాలని. ఆ కోరిక తీరకముందే చచ్చిపోయింది. తనకు ముందూ తనతోపాటూ ఎంతో మంది ఇలా అన్యాయంగా అర్ధంతరంగా చచ్చిపోయివుంటారు. కనీస మానవ అవసరాలు తీరక, కనీస మానవ మర్యాదలు దక్కక చచ్చి బతుకుతున్నవాళ్లు మనచుట్టూ ఇప్పటికీ ఎందరో ఉంటారు. ఈ వియోగాలు వ్యక్తులవి కావు. ఈ విషాదాలు వ్యక్తులవి కావు. అణగారిన కోరికలూ కలలూ మనుషులందరివీ. నాగరికతతో పాటు ఎదుగుతున్న మొత్తం సమాజానివి. ఈ శరీరం ఒక సమూహం. మనమింకా ఎవరి పక్క వాళ్లు సర్దుకొనే దశలోనే ఉన్నాం. మహా అయితే పక్కలేసేదాకా ఎదిగాం. ఈ సామాజిక శరీర ధర్మ శాస్త్రం మనకి ఎప్పటికి ఒంటబట్టేనో?!





Untitled Document
Advertisements