లంచం కోసం తహసీల్దార్ ముందే తన్నుకున్న వీఆర్వోలు

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 09:23 PM

లంచం కోసం తహసీల్దార్ ముందే తన్నుకున్న వీఆర్వోలు

కర్నూలు జిల్లాలో లంచం డబ్బుల కోసం ఇద్దరు వీఆర్వోలు బాహాబాహీకి దిగిన ఘటన సంచలనం సృష్టించింది. డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో తహసీల్దార్ ముందే ఇద్దరూ తన్నుకున్నారు. ఒకరు చెవి కొరికితే.. మరొకరు మెడపై రక్కేశారట. తహసీల్దార్ సాక్షిగా జరిగిన ఈ తతంగం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కర్నూలు నగరంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు బాహాబాహీకి దిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. డబ్బుల పంపకాల్లో వివాదం ఏర్పడడంతో ఇద్దరు వీఆర్వోలు ఎమ్మార్వో సమక్షంలోనే తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలయ్యాయి. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జోహారాపురం వీఆర్వో కృష్ణదేవరాయ మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. తనను డబ్బు కోసం వేధిస్తున్నాడంటూ వీఆర్వో కృష్ణదేవరాయ మరో వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి చెవిని కొరికేశారు. వేణుగోపాల్ రెడ్డి ఎదురుదాడికి దిగాడు. వీఆర్వో కృష్ణదేవరాయ మెడపై రక్కేశాడు. ఇద్దరు వీఆర్వోలు కొట్టుకోవడంతో కంగుతిన్న ఎమ్మార్వో వెంటనే తేరుకుని ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. కొంత సమయానికి ఇద్దరూ శాంతించడంతో ఎమ్మార్వో సహా అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే లంచాల కోసం కొట్టుకున్న ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణలో తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో అధికారులను భయాందోళనకు గురిచేసింది. కొందరు లంచాలు తీసుకోవడం లేదని బోర్డులు పెట్టుకునేందుకు సిద్ధమవుతుంటే.. మరికొందరు అధికారులు భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లంచం డబ్బుల కోసం వీఆర్వోలు బాహాబాహీకి దిగిన ఘటన వేళ్లూనుకుపోయిన అవినీతిని మరోమారు రుజువు చేసింది.







Untitled Document
Advertisements