రాష్ట్ర విభజన సమస్యలపై పట్టుబడతాం!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:03 AM

టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడు నామ నాగేశ్వర్‌రావు పార్లమెంట్ సమావేశాలలో కేంద్రం బిల్లులను ప్రవేశపెట్టడమే కాకుండా వాటిపై సమగ్ర చర్చకు పట్టుబడతామని స్పష్టం చేశారు. ఆదివారం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ ఉద్దేశ్యాన్ని కూలంకషంగా వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, వివిధ పార్టీల నేతలతో పాటు టిఆర్‌ఎస్ తరుపున కే. కేశవరావు, నామా నాగేశ్వరరావులు హాజరయ్యారు. అనంతరం నామ నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రానికి టిఆర్‌ఎస్ పక్షాన తగు సహకారం ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన అన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లులు పెడతామని చెప్పారన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం, వృద్ధి రేటు రోజురోజుకు పడిపోతోందన్నారు. అలాగే దేశంలో పెరిగిపోతున్న కాలు ష్యం, నిరుద్యోగులు, రైతులు అంశం పై చర్చ జరగాలని టిఆర్‌ఎస్ పక్షాన తాము పట్టబట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లవుతున్నా ఇంకా విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై గట్టిగా తమ వాదనను ఉభయ సభల్లోనూ వినిపించనున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యలపై సిఎం కెసిఆర్ స్వయంగా పలుమార్లు ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements