ముస్లింలతో పూజలందుకునే శ్రీకృష్ణుడు!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:18 AM

ముస్లింలతో పూజలందుకునే శ్రీకృష్ణుడు!

దేశంలో హిందూ ముస్లింల ఐక్యతగా నిలిచే ప్రదేశాలు అనేక ఉన్నాయి. మతసామరస్య వెల్లివిరిసేలా రాజస్థాన్‌లోని ఓ హిందూ ఆలయంలోని భగవంతుడు ముస్లిం సోదరులతో పూజలందుకోవడం విశేషం. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతాన్ని 14 వ శతాబ్దంలో తోమర్‌ రాజవంశీయులు పరిపాలించేవారు. ఆ వంశంలో అజ్మల్‌‌కు జైసల్మేర్ యువరాణి మినాల్‌దేవితో వివాహం జరిగింది. అయితే, వీరికి పుత్రసంతానం లేకపోవడంతో వారసులు ఎవరూ మిగలరనే బాధతో కుంగిపోయిన రాజా అజ్మల్ చివరికి తన ఇష్టదైవం శ్రీకృష్ణుడి వేడుకోవడానికి ద్వారక వెళ్లాడు. అక్కడి ఆలయంలోని కృష్ణుడి విగ్రహం ముందు విలపిస్తుండగా, అజ్మల్ ఏడుపు విని పూజారి విసుగెత్తిపోయాడు. నీ ఏడుపేదో సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి ఏడిస్తే ఫలితం ఉంటుందని చెప్పాడట. తనను వదలించుకోడానికి పూజారి చెప్పిన మాటల్ని నిజంగా నమ్మిన ఆ రాజు.. సముద్రంలో ఈతకొట్టుకుంటూ మునిగిపోయిన ద్వారకను చేరుకున్నాడు. అజ్మల్ భక్తికి మెచ్చిన కృష్ణుడు ఆయనకు దర్శనమిచ్చి, తానే స్వయంగా నీ వంశాంకురంగా జన్మస్తానని వరాన్ని ప్రసాదించాడు. కొన్నాళ్లకు అజ్మల్‌ భార్యకు వీరామ్‌దేవ్‌, రామ్‌దేవ్‌ అని ఇద్దరు కుమారులు జన్మించారు. రామ్‌దేవ్‌ చిన్నతనం నుంచి అలౌకిక శక్తులను ప్రదర్శించేవాడు. ఆయన మహిమలు చూసి పోఖ్రాన్ ప్రజలు విస్మయం చెందేవారు. వాటిలో కొయ్యగుర్రం కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటారు. రామ్‌దేవ్‌ కోసం ఓ కొయ్యగుర్రాన్ని తయారుచేయమని రాజా అజ్మల్ ఓ వడ్రండిని ఆదేశించి, ఇందుకోసం గంధపు చెక్క, అలంకరణకు ఖరీదైన వస్త్రాన్ని ఇచ్చాడు. అయితే, ఆ వడ్రంగి మాత్రం రాజు ఇచ్చిన వస్త్రంలోని భాగాన్ని ఉంచుకుని, పైపై మెరుగులు దిద్ది గుర్రాన్ని తయారుచేశాడు. రామ్‌దేవ్‌ ఆ గుర్రాన్ని ఎక్కగానే గాల్లోకి ఎగిరి మాయమైపోగా, ఎందుకిలా జరిగిందో రాజుకి అర్థం కాలేదు. వెంటనే ఆ వడ్రంగిని బెదిరించాడు. దీంతో అతను తన నేరాన్ని అంగీకరించాడు. రామ్‌దేవ్ బాల్యం చిలిపిచేష్టలతో గడిచిపోగా యుక్త వయసులో మాత్రం తన చెంతకు వచ్చినవారి కష్టాలను తీర్చడంతో సాగిపోయింది. తన వద్దకు ఎవరొచ్చి కష్టాలు చెప్పుకున్నా వాటిని తీర్చేవారు. రాజుగా తన అధికారాలతో, అవతార పురుషునిగా మహిమలతో రాజ్యంలోని ప్రజల కష్టాలను తీర్చిన రామ్‌దేవ్ పేరు తక్కువ కాలంలోనే మార్మోగిపోయింది. ఇది భారతావనిని దాటుకుని విదేశాలకు పాకిపోయింది. రామ్‌దేవ్ మహిమల గురించి విన్న మక్కాలోని ఐదుగురు పీర్లు ఆయనను పరీక్షించడానికి పోఖ్రాన్ చేరుకున్నారు. వారిని రామ్‌దేవ్ సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు. భోజన ఏర్పాట్లు చేస్తుండగా తాము రోజూ తినే కంచంలోనే తింటామనీ, మరే పాత్రలోనూ స్వీకరించబోమని ముస్లిం సోదరులు తేల్చిచెప్పారు. దానికి రామ్‌దేవ్ చిరునవ్వుతో... ‘మరేం ఫర్వాలేదు. మక్కాలోని మీ పాత్రలు స్వయంగా ఇక్కడికి వస్తున్నాయి’ అని చెబుతుండగా అవి గాల్లో తేలుకుంటూ రావడం చూసి వారు ఆశ్చర్యపోయారట. దీంతో తమ జీవిత చరమాంకం వరకూ కూడా రామ్‌దేవ్‌ పాదాల చెంతనే ఉంటూ ఆయనను ఆరాధించారు. అప్పటి నుంచీ రామ్‌దేవ్‌ను ‘రామ్‌షా పీర్’ పేరుతో ముస్లింలు సైతం పూజించడం విశేషం. కేవలం 33 ఏళ్లపాటు మాత్రమే జీవించిన రామ్‌దేశ్ 1442 భాద్రపద శుక్ల ఏకాదశినాడు శివైక్యం చెందారు. పోఖ్రాన్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని ‘రామ్‌దేవరా’ గ్రామంలో ఆయన సమాధి ఉంది. దాని పక్కనే ఐదుగురు పీర్ల సమాధులు కూడా కనిపిస్తాయి. రామ్‌దేవ్‌ శివైక్యం చెందిన చోటే కాదు దేశంలోని పలు ప్రాంతాలలో ఆయనకు బ్రహ్మాండమైన ఆలయాలను నిర్మించారు. అంతేకాదు, పాకిస్థాన్‌, కెన్యా లాంటి దేశాల్లోనూ ఆలయాలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా రామ్‌దేవ్‌ను ప్రార్థిస్తారు.








Untitled Document
Advertisements