డే/నైట్‌ టెస్టుకు ఈడెన్‌ ముస్తాబు

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:05 AM

టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడబోతున్న తొలి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈడెన్‌పైనే ఉంది. రెండు జట్లకు గులాబీ టెస్టులో ఆడిన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే ఆటగాళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సన్నాహకాలను ఆరంభించారు. అలాగే మొదటి టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండ్రోజులను సద్వినియోగం చేసుకునేందుకు ఇరు జట్లు ఇండోర్‌లోనే ఉండి నెట్స్‌లో కష్టపడుతున్నాయి. శుక్రవారం (22) నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి డే/నైట్‌ టెస్టుకు వేదికవుతున్న 'సిటీ ఆఫ్‌ జాయ్‌' కోల్‌కతా పూర్తిగా గులాబీమయం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం పింకూ-టింకూ అనే మస్కట్‌ను కూడా ఆవిష్కరించాడు. అంతేకాకుండా భారీ పింక్‌ బెలూన్‌ను కూడా మైదానంలో ఎగిరేశారు. ఇది మ్యాచ్‌ పూర్తయ్యేదాకా అక్కడే ఉండనుంది. మరోవైపు కోల్‌కతాలో ల్యాండ్‌మార్క్‌గా ఉన్న 157 అడుగుల షహీద్‌ మినార్‌తో పాటు పార్కులను పింక్‌ లైట్లతో అలంకరించారు. ఇవన్నీ కాకుండా ప్రజల్లో మరింత ఆసక్తి రేపేందుకు సిటీ అంతా 12 బిల్‌ బోర్డులను, ఆరు ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. గతవారం బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసినా ఈడెన్‌లో జరిగే తొలి డే/నైట్‌ టెస్టు కోసం అంతా సిద్ధం చేశామని క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ తెలిపాడు. 'గతవారం బుల్‌బుల్‌ తుఫాన్‌ కారణంగా బెంగాల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మ్యాచ్‌కు ఇంకా మాకు తగిన సమయం ఉండడంతో ఇబ్బందేమీ లేదు. పిచ్‌ మంచి స్థితిలోనే ఉంది. పచ్చిక కాస్త ఎక్కువగానే ఉంచాము. ఏదేమైనా ఈడెన్‌ మ్యాచ్‌ అద్భుతంగా సాగుతుందన్న నమ్మకం నాకుంది' అని ముఖర్జీ అన్నాడు. వాస్తవానికి పిచ్‌ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు స్థానిక జట్లతో ట్రయల్‌ మ్యాచ్‌ ఆడించాలనుకున్నా వర్షాల వల్ల సాధ్యం కాలేదని చెప్పాడు. ఇప్పటికే గులాబీ బంతులు ఈడెన్‌కు వచ్చాయని, పిచ్‌పై వాటిని పరీక్షించనున్నట్టు ముఖర్జీ తెలిపాడు.








Untitled Document
Advertisements