ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు సన్నద్ధం

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:07 AM

ప్రతిష్టాత్మక డే అండ్‌ నైట్‌ టెస్టు సన్నద్ధత కోసం ఆదివారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టీంఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అలాగే ఈ టెస్టులో పింక్‌బాల్‌ను ఉపయోగించనున్న నేపథ్యంలో ఇరు జట్లు దీనిపై దృష్టిని సారించాయి. బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా రెండో టెస్టు నవంబర్‌ 22న ప్రారంభం కానున్నది. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో.. డే అండ్‌ నైట్‌ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయం లభించింది. దీంతో అటు బంగ్లా, ఇటు టీమిండియా ఆటగాళ్లు పింక్‌బాల్‌తో ప్రాక్టీస్‌ కొనసాగించారు. రోహిత్‌ శర్మ, ఛటేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో ప్రాక్టీస్‌ చేశారు. శనివారం బంగ్లాతో మ్యాచ్‌ ముగిశాక హౌల్కర్‌ స్టేడియంలో కోచ్‌ రవిశాస్త్రి పర్యవేక్షణలో శిక్షణ కొనసాగింది. కోల్‌కతా డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ కోసం గులాబి బంతికి అలవాటు పడేందుకు హౌల్కర్‌ మైదానంలో సాధన చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఈ బంతితో సాధన చేశాడు. రిజర్వు బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌ సైతం సాధన చేయడం గమనార్హం. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను రాత్రిసమయంలో రోహిత్‌ శర్మ ఎదుర్కొన్నాడు. కోచ్‌ రవిశాస్త్రి బంతి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలించారు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్‌ ట్రోఫీలో ఆడిన అనుభవం కుల్‌దీప్‌కు ఉంది. అతడు బంతిని ఫ్లైట్‌ చేసినప్పుడు సీమ్‌ను అందుకోవడంలో బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడ్డారు.

Untitled Document
Advertisements