ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా సెన్సార్...సైజ్ ఎంతో తెలుసా?

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:13 AM

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓమ్నివిజన్ టెక్నాలజీస్ కంపెనీ గిన్నిస్ రికార్డుకెక్కింది. ఇసుక రేణువంత సైజులో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన కెమెరా సెన్సార్‌ను తయారు చేసి ఈ ఘనత సొంతం చేసుకుంది. సదరు కంపెనీ తయారు చేసిన ఓవీ6948 కెమెరా సెన్సార్ చాలా చిన్న సైజులో ఉంటుంది. దీని కొలతలు 0.575ఎంఎం x 0.575ఎంఎం x 0.232 ఎంఎం. కాగా ఈ కెమెరా సెన్సార్‌తో 200 x 200 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగిన వీడియోలను 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో చిత్రీకరించుకోవచ్చు. ఈ కెమెరా సెన్సార్‌ను వైద్య పరీక్షల్లో ఉపయోగించే పరికరాలు, యంత్రాల్లో వాడేందుకు అనువుగా ఉండేలా రూపొందించామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సదరు ఓవీ6948 కెమెరా సెన్సార్‌కు 3.3 వోల్టుల పవర్ అవసరం అవుతుందని, దీన్ని -20 డిగ్రీల నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఉపయోగించవచ్చని, ఈ కెమెరా సెన్సార్‌ నుంచి వెలువడే హీట్ తక్కువగా ఉంటుంది కనుక ఎండోస్కోపీ వంటి పరికరాల్లో ఈ కెమెరాతో ఎక్కువ సేపు రోగిని టెస్ట్ చేయవచ్చని, దీంతో రోగికి అసౌకర్యం కలగకుండా ఉంటుందని ఓమ్నివిజన్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది. ఈ కెమెరా సెన్సార్‌ దాని చుట్టూ 4 మీటర్ల పరిధిలో ఉండే ఇతర డివైస్‌లకు కనెక్ట్ అవుతుందని, దీంతో ఆ కెమెరా నుంచి సులభంగా ఇతర డివైస్‌లకు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. అలాగే మానవ శరీరంలో ఉండే చిన్న సైజులోని రక్తనాళాల్లో కూడా ఈ కెమెరా సెన్సార్‌ సులభంగా తిరుగుతుందని, 120 డిగ్రీల కోణంలో లోపలి దృశ్యాలను చిత్రీకరిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Untitled Document
Advertisements