వచ్చే దశాబ్దంలో అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధి

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:16 AM

మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌లో ఆధార్ గుర్తింపు వ్యవస్థను, అలాగే ఆర్థిక సేవల రంగం, ఔషధ రంగంలో దేశ పనితీరును ప్రశంసించారు. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ భారీ ఆర్థిక మందగమనంలో ఉందని, ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగుతుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అయితే గేట్స్ మాట్లాడుతూ, ‘సమీప భవిష్యత్తు గురించి పెద్దగా నాకు తెలియదు, కాని వచ్చే దశాబ్దంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పగలను. ఇది చాలా మందిని పేదరికం నుండి బయటకు తీసుకువస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య, విద్యా రంగంలో మరింత దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారతదేశం అన్ని అవకాశాలను కలిగి ఉన్నందున వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశాభావంతో వున్నారని గేట్స్ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చిన బిల్‌గేట్స్ భారత్‌లో తన ఫౌండేషన్ పనులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇది ఆరు సంవత్సరాలలో దేశంలో అత్యల్ప త్రైమాసిక వృద్ధి రేటు. ఆధార్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ద్వారా చెల్లింపు వ్యవస్థను గేట్స్ ప్రశంసించారు. ఆధార్ గుర్తింపు వ్యవస్థ, యుపిఐ చెల్లింపు విధానం ప్రజలలో అవలంభిస్తున్న తీరును కొనియాడారు. నందన్ నీలేకని వంటి వారితో భాగస్వామ్యం కావడం గురించి మనం ఆలోచించాలని, డిజిటల్ ఐడెంటిటీ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ సిస్టమ్స్ ఎలా అమలు చేయవచ్చో ఇతర దేశాలు భారతదేశం నుండి తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. వాక్సీన్ తయారీలో భారతదేశం ప్రముఖ పాత్రను గేట్స్ ప్రశంసించారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలో ప్రభుత్వం గణనీయమైన కృషి చేసిందని గేట్స్ పేర్కొన్నారు. 64 ఏళ్ల బిల్ గేట్స్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. శుక్రవారం ఆయన మొత్తం నికర విలువ 110 బిలియన్ డాలర్లకు చేరింది. బిల్ గేట్స్ ఇప్పటివరకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 35 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఫౌండేషన్ వివిధ దేశాలలో పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.Untitled Document
Advertisements