చికిత్సకు డబ్బుల్లేక కొడుకును పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 09:17 AM

చికిత్సకు డబ్బుల్లేక కొడుకును పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. అయితే, గత రెండు నెలల నుంచి వేతనాలు అందక కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో పలువురు కార్మికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా, అనారోగ్యంతో బాధపడుతోన్న కుమారుడికి వైద్యం చేయించలేక ఓ కార్మికుడి తన బిడ్డను పోగొట్టుకున్న హృదయవిదారక ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌ వైద్య ఖర్చులు భరించలేక కొడుకును పోగొట్టుకున్నారు. ఈ విషాదం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఆదివారం జరిగింది. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడకు చెందిన రమేశ్.. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నారు. రమేశ్‌ తన భార్య రజిత, ఇద్దరు పిల్లలతో జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డలో నివాసం ఉంటున్నారు.ఈ నేపథ్యంలో రమేశ్‌ పెద్ద కుమారుడు సాయికుమార్‌ 20 రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. మొత్తం రూ.3 లక్షల వరకు ఖర్చయినా బాలుగు కోలుకోలేదు. తమ దగ్గరున్న డబ్బు అయిపోవడంతో నిస్సహాయ స్థితిలో రమేశ్ దంపతులు తమ కుమారుడ్ని రెండు రోజుల జడ్చర్లలోని ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి సాయికుమార్‌ ఆదివారం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతో కన్న కొడుకు కోల్పోయామని రమేశ్, రజితలు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదన చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం సాయికుమార్ మృతదేహాన్ని తమ స్వగ్రామం మామిడిమాడకు తరలించారు.


Untitled Document
Advertisements