కుడి, ఎడమ చేత్తో బౌలింగ్!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 10:16 AM

కుడి, ఎడమ చేత్తో బౌలింగ్!

క్రీజులో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉంటే ఎడమ చేతితో బౌలింగ్‌.. ఒకవేళ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉంటే కుడి చేతి వాటంతో బౌలింగ్. మొత్తంగా టీమ్‌లో ఇద్దరు స్పిన్నర్ల స్థానాన్ని భర్తీ చేసేస్తూ.. క్రికెట్ ప్రపంచాన్ని తన స్పెల్‌తో గ్రెగొరీ మహ్లోక్వానా ఊపేస్తున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ తరహాలో జరుగుతున్న ‘మాన్షీ సూపర్ లీగ్’ టీ20 టోర్నీలో ఇప్పుడుగ్రెగొరీ మహ్లోక్వానా బౌలింగే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. టోర్నీలో క్యాప్‌ టౌన్ బ్లిట్జ్ టీమ్‌కి ఆడుతున్న 24 ఏళ్ల గ్రెగొరీ మహ్లోక్వానా.. తాజాగా డర్బన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కుడి, ఎడమ బౌలింగ్‌తో వరుస వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ సారెల్ ఎర్వీ‌ని బోల్తా కొట్టించేందుకు కుడి చేతి వాటం బౌలింగ్‌కి మారిన గ్రెగొరీ మహ్లోక్వానా ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి విసిరాడు. దీంతో.. కవర్స్ దిశగా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించిన అతను ఫీల్డర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ డీజే విలాస్‌ని ఔట్ చేసేందుకు ఎడమ చేతి వాటం బౌలింగ్‌కి మారిన గ్రెగొరీ మహ్లోక్వానా.. అతడ్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దక్షిణాఫ్రికాకి చెందిన గ్రెగొరీ మహ్లోక్వానా 2018-19లో దక్షిణాఫ్రికా క్రికెట్ అసోషియేషన్ (సీఎస్ఏ) టీ20 ఛాలెంజ్‌ టోర్నీతో వెలుగులోకి వచ్చాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌‌కి అనుగుణంగా బౌలింగ్‌ని మార్చుకునే ఈ బౌలర్‌ కోసం మాన్షి సూపర్ లీగ్ ఆటగాళ్ల వేలంలో అన్ని ఫ్రాంఛైజీల మధ్య గట్టి పోటీ నడిచింది. కానీ.. చివరికి రూ.10 లక్షల ధరతో క్యాప్‌టౌన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అతడ్ని మిస్ చేసుకున్న ఫ్రాంఛైజీలు అన్నీ చింతించేలా ఈ యువ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు.






Untitled Document
Advertisements