నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 11:21 AM

నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. నిజామాబాద్‌ నుంచి ఆలీసాగర్ పార్కుకు వెళుతున్న కారు అతివేగంగా దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను డ్డీకొట్టడంతో ఆటో రోడ్డు పక్కనే గోతిలో బోర్లాపడగా దానిపై కారు పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నయీమ్‌(35)తో సహా ఆటోలో ఉన్న చిక్కల సాయిలు (60), ఆకుల బాలామణి (55), జక్కం గంగమణి (65), కల్లేపురం సాయిలు (70) చనిపోయారు.

జానకంపేటకు చెందిన వారందరూ కుర్నాపల్లి దర్గా వద్ద జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యి తిరిగి వస్తుండగా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఇద్దరినీ పోలీసులు అదుపులో తీసుకోగా మరో ముగ్గురు పరారయ్యారు.

ప్రమాదం సంగతి తెలియగానే స్థానికులు అక్కడకు చేరుకొని జేసీబీ సాయంతో కారును పక్కకు తొలగించి ఆటోలో నలిగిపోయున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర గాయాలవడంతో అందరూ మృతి చెందారు. చనిపోయిన వారందరూ ఒకే గ్రామానికి చెందినవారవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements