తెలంగాణ పాఠశాలలో త్వరలోనే ‘నీటి గంటలు’

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 11:23 AM

అవును. తెలంగాణ పాఠశాలలో త్వరలోనే ‘నీటి గంటలు’ మ్రోగనున్నాయి. విద్యార్ధులు నీళ్ళు త్రాగకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన కేరళ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రతీ పాఠశాలలో నిర్ధిష్ట సమయంలో రోజుకు మూడుసార్లు గంట మ్రోగించి విద్యార్దులందరూ తప్పనిసరిగా నీళ్ళు త్రాగేలా చేస్తోంది. అది చూసి కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో ‘నీటి గంటలు’ మ్రోగించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కంటే ముందుగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిమ్మంపేట, నారాయణపేటలోని ఎడవల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ‘నీటి గంటలు’ పద్దతి అమలుచేయడం ప్రారంభించి యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి.

పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో సరైన టాయిలెట్లు లేకపోవడం వలన నీళ్ళు త్రాగితే మూత్రవిసర్జనకు వెళ్ళవలసి వస్తుందనే భయంతో చాలా మంది విద్యార్దులు...ముఖ్యంగా బాలికలు దాహం వేస్తున్నా నీళ్ళు త్రాగడం మానుకొంటున్నారు. దాని వలన వారు తీవ్ర డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఆ కారణంగా చిన్నప్పటి నుంచే విద్యార్దులలో కిడ్నీ, లివర్, చర్మ సంబందిత ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టి, త్రాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కానీ నేటికీ రాష్ట్రంలో అనేక పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో సరైన టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్దులు నీళ్ళు త్రాగకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నీటి గంటల పద్దతి అమలుచేయడంతోపాటు రాష్ట్రంలో విద్యాలయాలలో టాయిలెట్లు, త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Untitled Document
Advertisements