Sadak Bandh: రేపు హైదరాబాద్ టూ కోదాడ సడక్ బంద్

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 12:15 PM

Sadak Bandh: రేపు హైదరాబాద్ టూ కోదాడ సడక్ బంద్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, జేఏసీ చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఉస్మానియా హాస్పిటల్‌ను ముట్టడించే అవకాశం ఉందని భావిస్తోన్న పోలీసులు అక్కడ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా మంగళవారం సడక్ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు మద్దతు తెలిపాయి. విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ జేఏసీ... చర్చలకు విలీనం విఘాతం కల్గిస్తోందన్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్న ఆర్టీసీ జేఏసీ.. హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. సడక్‌బంద్‌లో భాగంగా హయత్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొని, విజయవంతం చేస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఆర్టీసీ తాత్కాలిక సునీల్‌ శర్మ తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని, ఈ విషయాన్ని హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలపై హైకోర్టు చీవాట్లు పెడుతున్నా కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆర్టీసీ సమ్మెను సమర్ధించిన కేసీఆర్‌.. నాటి సమైక్య ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం తమకు లేదని ఉద్ఘాటించారు.






Untitled Document
Advertisements