ఇలాగైతే మ్యాచ్‌లు గెలవడం కష్టం!

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 11:45 AM

ఇలాగైతే మ్యాచ్‌లు గెలవడం కష్టం!

ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ తప్పిదాలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. సులువుగా అందుకోవాల్సిన ఓ క్యాచ్‌ని వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేయగా.. రిషబ్ పంత్, మనీశ్ పాండే‌లు కూడా కీలక సమయాల్లో క్యాచ్‌లను చేజార్చారు. దీంతో.. 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 9 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సిమన్స్ (67 నాటౌట్: 45 బంతుల్లో 4x4, 4x6) వ్యక్తిగత స్కోరు 5 వద్దే క్యాచ్ ఇవ్వగా దాన్ని తత్తరపాటులో సుందర్ వదిలేయడం మ్యాచ్‌లో కీలకమలుపుగా చెప్పొచ్చు. ఫీల్డింగ్ తప్పిదాలపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘టీమ్‌ ఇలా ఫీల్డింగ్‌‌లో పొరపాట్లు చేస్తే..? ఎంత భారీ స్కోరు చేసినా మ్యాచ్‌లు గెలవలేం. ఈ మ్యాచ్‌లోనే కాదు.. శుక్రవారం జరిగిన ఉప్పల్ టీ20లోనూ ఫీల్డింగ్ తప్పిదాలు జరిగాయి. రెండో టీ20లో కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ చెరొక క్యాచ్‌ని.. అదీ ఒకే ఓవర్‌లో చేజార్చారు. ఆ రెండు వికెట్లు పడింటే..? కచ్చితంగా వెస్టిండీస్ టీమ్‌పై ఒత్తిడి పెరిగేది’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. తిరువనంతపురం టీ20లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. ఓ అద్భుతమైన డైవ్ క్యాచ్‌ని అందుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సిమ్రాన్ హిట్‌మెయర్ (23: 14 బంతుల్లో 3x6) లాంగాఫ్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించగా.. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన కోహ్లీ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ.. క్యాచ్ అందుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయిన కోహ్లీ బౌండరీ లైన్‌ వద్ద పడిపోయి కొద్దిదూరం జారుకుంటూ వెళ్లాడు. అయితే.. చాకచక్యంగా బౌండరీ లైన్‌ని తాకకుండా జాగ్రత్తపడటంతో భారత్‌కి వికెట్ దక్కింది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌ ఇప్పుడు 1-1తో సమమవగా.. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ ముంబయిలోని వాంఖడే వేదికగా బుధవారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా వాంఖడే పిచ్‌‌పై వెస్టిండీస్ టీమ్‌లోని చాలా మంది క్రికెటర్లకి మంచి అవగాహన ఉంది. దీంతో.. పోరు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.











Untitled Document
Advertisements