మహబలుడైన భీముడు కొండ చిలువకు ఎలా చిక్కాడు?

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:19 AM

వాయు దేవుడి అంశంతో జన్మించిన భీముుడు అమిత బలశాలి. భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ భీముడికి ఎవరూ సాటిలేరంటే అతిశయోక్తి కాదు. జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించిన యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించాడు. కురుక్షేత్రంలో ధుర్యోధనుడిని హతమార్చిన ధీశాలి. దానంలో కర్ణుడికి, పరాక్రమంలో భీముడికి ఎవరూ సాటిలేరని చెబుతారు. అలాంటి భీముడు ఓ కొండ చిలువకు బందీ కావాల్సి వచ్చింది. అరణ్య పర్వంలోని ఆ వృత్తాంతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకరోజు భీముడు వేట కోసం హిమాలయాలకు వెళ్లాడు. హఠాత్తుగా ఒక కొండ చిలువ భీముణ్ని చుట్టేసింది. దాని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసినా పదివేల ఏనుగుల బలంతో సమానమైన బలమున్న భీముడికి సాధ్యపడలేదు. ఎంత పెనుగులాడిన అలసిపోయాడే తప్ప ఫలితం లేకపోయింది.
వేట కోసం అడవికి వెళ్లిన భీముడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో భీముడిని వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్తాడు. అరణ్యంలో కొండ చిలువకు బందీగా ఉన్న భీముణ్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన తమ్ముడిని వదిలిపెట్టమని, ప్రతిఫలంగా నీకు సరిపడా ఆహారం సమకూరుస్తానని ప్రాధేయపడతాడు. ఇది నా రాజ్యం, ఇక్కడికి వచ్చిన వారు నాకు ఆహారం కావలసిందే. ప్రాణం మీద ఆశలుంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అని కొండ చిలువ బదులిస్తుంది.
ధర్మరాజు పదే పదే ప్రాధేయ పడటంతో.. నా ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నీ తమ్ముడిని వదిలి పెడతానని చెబుతుంది. నువ్వు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాపవిముక్తి అవుతుందని చెబుతుంది. ధర్మరాజు అందుకు అంగీకరించడంతో ముందుగా తన గతాన్ని చెబుతుంది.
‘ధర్మరాజా.. నేను నీ వంశంలోనే పుట్టాను. నా పేరు నహుషుడు. ఇంద్రుడితో సమానుడిని. సప్త రుషులను అవమానించాను. అగస్త్య మహర్షి శాపం కారణంగా పాముగా మారాను. శాప విమోచనం కోసం ప్రార్థించగా.. పాము రూపంలో ఉన్న నా ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానాలు ఇస్తారో.. అప్పుడే నీకు శాపం నుంచి విముక్తి లభిస్తుందని అగస్త్యుడు తెలిపాడు. అప్పటి నుంచి ఇలా పాము రూపంలో ఇక్కడే ఉన్నాన’ని నహుషుడు చెబుతాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకోమంటాడు.
నహుషుడి ప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు..

ప్రశ్న 1. బ్రాహ్మణుడి గుణాలేంటి? అతడు తెలుసుకోవాల్సిన విషయమేంటి?
జ. సత్యం, దానబుద్ధి, క్షమించే గుణం, అహింస, తపం, శీలం అనే లక్షణాలు ఎవరిలో ఉంటే వారిని బ్రాహ్మణుడు అనొచ్చు. ఉత్తమ సంస్కారం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు. సుఖ దుఃఖాల పట్ల సమబుద్ధి కలిగి ఉండటమే అతడు తెలుసుకోదగిన ఉత్తమ విద్య.

ప్రశ్న 2: పరోపకారం చేసి, అబద్దాలు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎలా పొందింది?

జవాబు: దానం, పరోపకారం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మాలు. వీటన్నింటిలో అహింస విశేషమైంది. దానం మొదలైన కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించేవాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేసేవాడు జంతువుగా జన్మిస్తాడు. అందుకే అహింస పరమ ధర్మం అని ధర్మరాజు బదులిచ్చాడు. నహుషుడు అడిగిన అనేక ప్రశ్నలకు ధర్మజుడు సమాధానాలు ఇస్తాడు. అతడి సమాధానాలకు సంతృప్తి చెందిన నహుషుడు భీముడిని వదిలిపెట్టాడు. శాప విమోచనం కావడంతో సర్ప రూపాన్ని వదిలి మనిషి రూపంలోకి మారాడు.





Untitled Document
Advertisements