రష్యా క్రీడాకారులపై నిషేధం !

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:48 AM

ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) రష్యాకు షాక్ ఇచ్చింది. ఒలింపిక్ క్రీడలు సహా అన్ని ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ లో రష్యా క్రీడాకారులపై నిషేధం విధించింది. డోపింగ్ వివరాలు బైటికి పొక్కకుండా లేబరేటరీ డేటాను తారుమారు చేసినందుకు వాడా ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనకు ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్, 2022లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ సహా మరే ఇతర అంతర్జాతీయ క్రీడల్లో రష్యా పాల్గొనడానికి వీలుండదు. డోపింగ్ కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగ శాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే దీనికి కారణం. ‘ప్రతిపాదనల పూర్తి జాబితాకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది’ అని వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్ తెలిపారు. ‘రష్యా డోపింగ్ నిరోధక సంఘం(రుసడా)పై నాలుగేళ్ల నిషేధాన్ని వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది’ అని ఆయన చెప్పారు. దీంతో రష్యా డోపింగ్ వ్యతిరేక సంఘం తన గుర్తింపును కోల్పోయినట్లయింది. ఈ రూలింగ్ ప్రకారం రష్యా క్రీడాకారులు తటస్థులుగా ఉంటేనే అనుమతిస్తారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహిత డోపింగ్ వ్యవస్థలో తాము భాగస్వాములు కాలేదని వారు హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై అపీలు చేసుకోవడానికి రష్యాకు వాడా 21 రోజుల గడువు ఇచ్చింది. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో సంచలనం రేపింది. అక్కడి క్రీడా అధికారులు, కోచ్‌లు తమ అథ్లెట్లకు శిక్షణతో పాటుగా నిషేధిత ఉత్ప్రేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో ‘వాడా’ విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో ఇదంతా అధికారుల అండదండలతోనే జరిగినట్లు తేలడంతో కథ ఆ దేశ నిషేధానికి దారి తీసింది. సాధారణంగా డోపీలపై నిషేధం విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అధికార గణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా దేశాన్నే నిషేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత రియో ఒలింపిక్స్(2016)లో రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్‌అథ్లెట్లను అనుమతించలేదు. మిగతా క్రీడాకారులను మాత్రం ఒలింపిక్ కమిటీ (ఐఓసి) గొడుగు కింద అనుమతించారు.





Untitled Document
Advertisements