50వేల మంది ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవేత్తలకు శిక్షణ

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:17 AM

వాల్మార్ట్ వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 25 సంస్థలను ప్రారంభించనుంది. ఈ సంస్థలు ఎంఎస్‌ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) రంగానికి చెందిన 50,000 మంది పారిశ్రామికవేత్తలకు శిక్షణనిస్తాయి. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుడిత్ మెక్‌కెన్నా మాట్లాడుతూ, ‘వాల్‌మార్ట్ గ్రోత్ సప్లయర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ కింద ఈ సంస్థలను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా తయారీ కేంద్రాల సమీపంలో ప్రారంభిస్తామని తెలిపారు. వాల్‌మార్ట్ భారతదేశంపై దీర్ఘకాలిక నిబద్ధతలో ఇవి భాగమని అన్నారు. అయితే ఈ సంస్థల నెట్‌వర్క్‌లో ఖర్చు వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

ఈ చర్య దేశంలో స్థానికంగా బలోపేతానికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌లో వాల్‌మార్ట్‌కు భారత్ ఐదవ అతిపెద్ద కేంద్రంగా ఉంది. చైనా, అమెరికా, మెక్సికో, కెనడా ముందున్నాయి. వాల్‌మార్ట్ 14 మార్కెట్లలో ప్రపంచ కార్యకలాపాలను కలిగి ఉంది. మొదటి ఐదేళ్లలో 50,000 మంది ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడం సంస్థ లక్ష్యమని మెక్‌కెన్నా అన్నారు. తయారీ కేంద్రాల వద్ద 25 సంస్థలలో వారికి శిక్షణ ఇస్తామని అన్నారు. వాల్‌మార్ట్ గత దశాబ్ద కాలంగా భారతీయ ఎంఎస్‌ఎంఇలను సప్లై చైన్ విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ‘ఐదు ప్రధాన వాల్‌మార్ట్ షాపింగ్ మార్కెట్లలో భారతదేశం ఒకటి.

భారతీయ ఉత్పత్తులను 14 గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేసే గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ మాకు ఉంది. రైతులు, కిరాణా దుకాణాలు, ఎంఎస్‌ఎంఇల అవసరాలను గుర్తించడానికి కంపెనీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులతో కలిసి పనిచేస్తుంది’ అని మెక్కెన్నా అన్నారు. భారతదేశంలో పెట్టుబడులను కొనసాగిస్తామని, వాల్‌మార్ట్ ప్రస్తుతం 27 ఉత్తమ ధర ఆధునిక టోకు దుకాణాలను నిర్వహిస్తోందని తెలిపారు. సంస్థ ప్రస్తుతం సుమారు 5,000 ఉత్పత్తులను క్యాష్ అండ్ క్యారీ హోల్‌సేల్ విభాగంలో అందిస్తోంది. ఇందులో 95 శాతం స్థానికంగా కొనుగోలు చేస్తోంది.





Untitled Document
Advertisements