యోగ లాభాలు మీకు తెలుసా ...

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 11:38 AM

యోగ వల్ల ఒరిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. యోగ చేయడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలిగే తత్వం ఒంటబడుతుంది. వాటిలో కొన్ని ప్రయోజనాలు చూద్దాం!

హృదయసంబంధ ఆరోగ్యం : రక్తనాళాలు కుంచించుకుపోవటం వల్ల హైపర్‌టెన్షన్, హృదయ ధమనులు మూసుకోవటం వల్ల గుండె జబ్బులు వస్తాయనే విషయం తెలిసిందే! యోగాసనాల వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది రక్తపోటు నియంత్రించబడి గుండె కండరాలకు సరిపడా రక్తప్రసరణ జరుగుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

మెడ, వెన్ను నొప్పులు : యోగాలో భంగిమలు ప్రధానం. క్రమం తప్పక యోగాభ్యాసం చేస్తే శరీరాకృతి బాగుంటుంది. వెన్ను నిటారుగా మారటంతోపాటు నొప్పులను తగ్గిస్తుంది. నొప్పులకు పట్టుతప్పిన వెన్నుపూసలు, వెన్నుపాము వంపు కారణం కాదు. ఆ తేడాల వల్ల నొక్కుకుపోయిన నరాలతో అంటుకుని వున్న కండరాలు కుంచించుకుపోవటమే కారణం.

ఆ కండరాలు బిగదీసుకుపోయినా, ఒత్తిడికి గురయినా నొప్పి మొదలవుతుంది. అందుకే వైద్యులు ఆ కండరాలు రిలాక్సయ్యే మందులు సూచిస్తారు. కానీ యోగాలో కొన్ని ఆసనాల వల్ల శ్వాస పీల్చుకుని వదిలే క్రమంలో కండరాలు రిలాక్స్ అవుతాయి. దానివల్ల నొప్పి అదుపులోకి వస్తుంది.

మెదడు చురుకుదనం : యోగాలో శ్వాస మీద ధ్యాస నిలపటం వల్ల తగినంత ఆక్సిజన్ శరీరానికి, మెదడుకు అంది దాని పనితీరు మెరుగువుతుంది. క్రమం తప్పక యోగా చేస్తే మెదడు చురుకుదనం పెరగటంతోపాటు డిప్రెషన్ తగ్గుతుంది.

ఒత్తిడి, ఆందోళనలు : యోగాభ్యాసం వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ స్రావం తగ్గుతుంది. మరీముఖ్యంగా 25,- 45 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీలల్లో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి. వీళ్లు వారంలో రెండుసార్లు బిక్రమ్ (హఠయోగలో 90 నిమిషాలపాటు సాగే అభ్యాసం) యోగ సాధన చేస్తే ఆ లక్షణాలు తగ్గుతాయి. ఆందోళన, ఒత్తిడిలను నియంత్రించుకోవటంలో పట్టు సాధించగలుగుతారు.

డిప్రెషన్ : ప్రసవానంతరం, క్యాన్సర్ చికిత్సల ఫలితంగా స్త్రీలు విపరీతమైన డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. 24 వారాలపాటు ప్రతిరోజు 60 నిమిషాలపాటు యోగాభ్యాసం చేస్తే డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయి. దాంతో చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు.





Untitled Document
Advertisements