క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఏమౌతుంది?

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 01:18 PM

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఏమౌతుంది?

క్రెడిట్ కార్డుల వినియోగం నానాటికీ పెరిగిపోతుంది. వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే స్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించుకున్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు రావు. లేదంటే మాత్రం సమస్యలు ఎదురవుతాయి. క్రెడిట్ కార్డు బిల్లును ప్రతి నెలా పూర్తిగా చెల్లిస్తూ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వడ్డీ, ఫైనాన్స్ చార్జీలు వంటివి పడవు. ఒకవేళ బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోతే అప్పుడు బాదుడు మొదలవుతుంది. ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌పై వడ్డీ పడుతూ వస్తుంది. వడ్డీ మొత్తం భారీగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000 ఖర్చు చేశాడు. ఈ మొత్తాన్ని గ్రేస్ పీరియడ్‌లో పూర్తిగా చెల్లిస్తే ఎలాంటి చార్జీలు పడవు. అయితే ఒకవేళ ఈ రూ.1,000 చెల్లించకపోతే.. లేదంటే ఈ బ్యాలెన్స్‌లో ఒక్క రూపాయి మిగిలినా కూడా అప్పుడు రూ.1000పై చార్జీలు పడతాయి. 36 నుంచి 42 శాతం మధ్యలో వడ్డీ పడుతుంది. బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే కేవలం భారీ వడ్డీతో మాత్రమే సరిపెట్టుకోవు. వడ్డీకి అదనంగా ఫైనాన్స్ చార్జీలు విధిస్తాయి. మీరు బిల్లు మొత్తం చెల్లించనంత వరకు ప్రతి నెలా ఈ చార్జీలు పడుతూనే వస్తాయి. దీంతో మీరు బ్యాంకుకు భారీ మొత్తం చెల్లిస్తూ వస్తారు. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తంగా చెల్లించలేకపోతే మినిమమ్ బ్యాలెన్స్ అయినా కట్టేయాలి. ఇలా చేస్తే వడ్డీ బాదుడు మోయాలి. అలాగే ఫైనాన్స్ చార్జీలు కూడా ఉంటాయి. అయితే మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడదు. అదే మీరు క్రెడిట్ కార్డు బిల్లు అస్సలు చెల్లించకపోతే అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే అప్పుడు బ్యాంకు మీ క్రెడిట్ కార్డు ఫెసిలిటీని రద్దు చేసే అవకాశముంది. అంటే మీ కార్డు బ్లాక్ అవుతుంది. పని చేయదు. అలాగే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. 3 నెలలకు పైన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా బ్యాంకులు డబ్బు రికవరీకి లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. క్రిమినల్ చార్జీలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.











Untitled Document
Advertisements